Etela Rajender : తెలంగాణ బీజేపీలో కలకలం: ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్.!
Etela Rajender : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అధికార పీఠమెక్కేలా బీజేపీలో కొత్త ఉత్సాహం నింపేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సాయశక్తులా కృషి చేస్తున్నమాట వాస్తవం. విడతల వారీగా ఆయన పాదయాత్రలు చేస్తున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మీద తరచూ దుమ్మెత్తిపోస్తున్నారు బండి సంజయ్. అందుకే, బీజేపీ అధిష్టానం నుంచి బండి సంజయ్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ఇదే జోరు కొనసాగనివ్వాలి..’ అంటూ బండి సంజయ్‌కి కావాల్సినంత ప్రోత్సాహాన్ని బీజేపీ అధిష్టానం ఇస్తోంది. అంతే కాదు, బీజేపీ జాతీయ నాయకులు ఎవరో ఒకరు తరచూ తెలంగాణకు వచ్చి వెళుతున్నారు. ప్రధానంగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి బీజేపీ జాతీయ నేతలు ఎక్కువగా వెళుతున్న సంగతి తెలిసిందే.
ఆ భాగ్యలక్ష్మి దేవాలయం కేంద్రంగా చేసుకుని బండి సంజయ్ రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు.. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలూ చేస్తున్నారు. అంతా బాగానే నడుస్తోంది తెలంగాణ బీజేపీలో అనుకుంటున్న తరుణంలో, ఈటెల రాజేందర్‌కీ బండి సంజయ్‌కీ మధ్య పొసగడంలేదన్న గుసగుసలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో షురూ అయ్యాయి. ఇతర పార్టీల నుంచి ప్రముఖ నాయకుల్ని బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యతను అధిష్టానం, మాజీ మంత్రి.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈటెల తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే, చేరికల కమిటీ ఛైర్మన్‌కి పాపులారిటీ పెరుగుతుండడాన్ని బండి సంజయ్ జీర్ణించుకోలేకపోతున్నారట.
దాంతో, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్, తనకున్న బలంతో ఈటెల వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నారట. ఈటెల తాను కేసీయార్ మీద పోటీ చేస్తానని సవాల్ విసిరితే, ‘ఎవరు ఎక్కడ పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుంది..’ అంటూ బండి సంజయ్, తన మీద కౌంటర్ ఎటాక్ చేయడాన్ని ఈటెల అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఈ ప్రచారంలో నిజమెంతోగానీ.. ఇదంతా బీజేపీలో కొంత గందరగోళానికి కారణమవుతోంది. నిప్పు లేకపోయినా రాజకీయాల్లో పొగ వస్తుంది. ఆ ఆస్కారం లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత బండి సంజయ్ మీదనే వుంది.