Gadapa Gadapa Program : గడప గడపకు కార్యక్రమానికి నిరసన సెగ.. సొంత జిల్లాలో జగన్ కు షాకిచ్చిన ప్రజలు
Gadapa Gadapa Program : కడప జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా. అంతే కాదు.. అది వైసీపీకి కంచుకోట. అవును ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కంచుకోటగా ఉన్న కడప జిల్లా.. ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. ఆ జిల్లాలో ప్రజలంతా వైసీపీ పాలనపై ఖచ్చితంగా పాజిటివే ఉండాలి. కానీ.. ఇక్కడ మాత్రం పరిస్థితులు అలా లేవు. కడప జిల్లాలో ఉన్న
మైదుకూరులో ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం ఆనే కార్యక్రమానికి నిరసన సెగ తగిలింది.మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. తన నియోజకవర్గంలోని నర్శిరెడ్డిపల్లె అనే గ్రామంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే.. ఎమ్మెల్యే వస్తున్నారని ముందే తెలుసుకున్న ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.
Gadapa Gadapa Program : 420 ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయిన ప్రజలు
ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకొని ఆ ఊళ్లో ఉన్న 420 ఇళ్లకు ప్రజలంతా తాళాలు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాక్ అయ్యారు. ఒకరిద్దరు గ్రామ పెద్దలు అక్కడ ఉండి ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేశారు. మాకు కనీసం రోడ్లు కూడా వేయలేదు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వలేదు. అందుకే గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారని గ్రామ పెద్దలు చెప్పుకొచ్చారు. గ్రామంలో ఎవ్వరూ లేకపోవడంతో ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. అయితే.. సీఎం జగన్ సొంత జిల్లాలో ఇలా పార్టీకి, ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంపై పలువురు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు.