చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్… రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
యాదాద్రి భువనగిరి: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టీకా కోసం వెళ్తున్న ఓ వృద్దురాలి ఆర్టీసి బస్టు ఢీకొట్టడంతో గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, దండు మల్కాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ (70) టీకా కోసం వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారి దాటుతుండగా ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. యాదమ్మ మృతిని నిరసిస్తూ గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ గ్రామానికి అండర్ పాస్ లేకపోవడం కారణంగా తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన కారణంగా రహదారిపై దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో చౌటుప్పల్ ఎసిపి శంకర్ సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులకు అండర్ పాస్ విషయంపై హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.