Boat | ఉత్తరప్రదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం .. 22 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా
Boat | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లాలో గురువారం ఉదయం భయానక ఘటన చోటుచేసుకుంది. ఇండియా–నేపాల్ సరిహద్దు సమీపంలోని కౌడియాలా నదిలో 22 మంది గ్రామస్థులతో ప్రయాణిస్తున్న ఒక పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, మరో 13 మందిని సురక్షితంగా రక్షించారు. ఇంకా ఎనిమిది మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
#image_title
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది
సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), సశస్త్ర సీమా బల్ (SSB) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారిని వెతికే ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే కౌడియాలా నదిలో వర్షాల కారణంగా నీటి మట్టం పెరగడం, ప్రవాహం ఉధృతంగా ఉండటం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కి సవాలుగా మారిందని అధికారులు తెలిపారు.
సుజౌలీ ప్రాంతంలోని భర్తాపూర్ గ్రామానికి చెందిన 22 మంది గ్రామస్థులు ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి పడవలో స్వగ్రామానికి బయలుదేరారు. అయితే నదిలో నీటి ఉధృతి పెరగడంతో పడవ అదుపుతప్పి బోల్తా పడినట్లు ప్రాథమిక సమాచారం.స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడినప్పటికీ, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. మిగతా ఎనిమిది మందిని కనుగొనడానికి రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బహ్రైచ్ జిల్లా పరిపాలన ఘటనపై దర్యాప్తు ప్రారంభించగా, బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు.