Huzurabad bypoll : ఎప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక? షెడ్యూల్ విడుదలయ్యేనా? పార్టీలు ఏమంటున్నాయి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Huzurabad bypoll : ఎప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక? షెడ్యూల్ విడుదలయ్యేనా? పార్టీలు ఏమంటున్నాయి?

 Authored By sukanya | The Telugu News | Updated on :1 September 2021,7:00 am

Huzurabad bypoll తెలంగాణలో ఉప ఎన్నిక కోసం సిద్ధంగా ఉన్న హుజూరాబాద్‌లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై అందరి దృష్టి నెలకొంది. నిజానికి ఆగస్టులోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నిక నిర్వహణపై ఈ నెల 28న అభిప్రాయాలు సేకరించింది. దీంతో సెప్టెంబర్‌లో హుజూరాబాద్ నగారా మోగే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికను నిర్వహించాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక టీఆర్ఎస్ సైతం సెప్టెంబర్‌లోనే ఉప ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో ఉంది.

అంతర్గతంగా తమ పార్టీ శ్రేణులను ఈ మేరకు సన్నద్ధం చేస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావు అక్కడ పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన తీరుపై ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు హుజూరాబాద్‌లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయనే దానిపై క్షేత్రస్థాయి నుంచి వివిధ వర్గాల ద్వారా సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నారని.. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Huzurabad bypoll

Huzurabad bypoll

దీని వెనుక.. Huzurabad bypoll

ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక సెప్టెంబర్‌లో జరుగుతుందన్న టీఆర్ఎస్, బీజేపీ ఆలోచన వెనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మార్చి 28న చనిపోయారు. సెప్టెంబర్ 28 నాటికి ఆయన చనిపోయి ఆరు నెలలు పూర్తి కానుంది. నిబంధనల ప్రకారం శాసనసభ్యుడు మరణించినా లేక రాజీనామా చేసినా ఆరు నెలల్లో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణను కేంద్ర ఎన్నిక సంఘం వాయిదా వేస్తూ వస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతుండటంతో.. కేంద్రం ఉప ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చేమో అనే చర్చ జరుగుతోంది.

TRS

TRS

అదే జరిగితే ఏపీలోని బద్వేలు స్థానంతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా జరుగుతుందని తెలంగాణ రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏపీలోని బద్వేలు నియోజకవర్గంతో పాటే తెలంగాణలోని హుజూరాబాద్‌కు కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ శ్రేణులకు సంకేతాలు కూడా పంపినట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చని.. అంతా సిద్ధంగా ఉండాలని సూచించినట్టు సమాచారం.

బీజేపీ సీరియస్.. Huzurabad bypoll

మరోవైపు హుజూరాబాద్‌లో గెలిచి టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఒక్కరే ప్రచారంలో దూసుకుపోతున్నా.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలోని బీజేపీ నేతలతో పాటు జాతీయ నేతలు కూడా ప్రచారం పర్వంలోకి దిగుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.

inugala peddireddy may be Joine congress

inugala peddireddy may be Joine congress

ఈమేరకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కూడా హుజూరాబాద్ లోనే ముగించేందుకు ప్లాన్ చేసుకున్నారు. మొత్తానికి సెప్టెంబర్‌లో అయినా హుజూరాబాద్ ఉపఎన్నికకు నగారా మోగుతుందా లేక ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం మరికొంత సమయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది