Huzurabad bypoll : పార్టీల ఫోకస్ హుజూరాబాద్ కు షిఫ్ట్.. ఎల్ రమణపైనే టీఆర్ఎస్ ఆశలు..?
Huzurabad bypoll తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ లో పుల్ జోష్ కనిపిస్తోంది. కొంత కాలంకా దూకుడు మీదున్న బీజేపీ కూడా వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటివరకు కేంద్ర సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి… కేబినెట్ బెర్త్ దక్కడంతో కమలనాధుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక ప్రత్యర్థి పార్టీలకు ధీటుగానే అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల్లోని కీలక నేతలు కారెక్కేలా ప్రయత్నాలు చేస్తోంది.
కేసీఆర్ ఆకర్ష్ లో భాగంగానే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరడానికి ముహుర్తం ఖారారైందని తెలుస్తోంది. రమణ గులాబీ గూటికి చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని ఊహాగానాలు వినిపించాయి.
హుజూరాబాద్ బరిలో ఎల్. రమణ.. Huzurabad bypoll
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను పార్టీలో చేర్చుకున్న వెంటనే హుజూరాబాద్ బరిలో నిలబెట్టాలనే ఆలోచన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బలమైన బీసీ నేతల్లో ఒకరైన ఎల్.రమణ .. ఈటల రాజేందర్‌కు సమ ఉజ్జీ అని కేసీఆర్ అభిప్రాయం. ఈ మేరకు ఇప్పటికే అంతర్గత సర్వేలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే అనేక మంది అభ్యర్థిత్వాలపై పరిశీలన చేయించినా, పెద్దగా సానుకూలత రాలేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ .రమణ అయితే.. ఈటలతో సరితూగుతారనే అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే.. ఎల్.రమణకు కూడా టీఆర్ఎస్ హైకమాండ్ సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆయన కేసీఆర్‌తో సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కరీంనగర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.
బీసీ నేతల మధ్యే కీలక పోరు.. Huzurabad bypoll
అయితే ఎల్.రమణను పార్టీలో చేర్చుకుని బరిలో నిలబెడితే మరింత ఆసక్తికరమైన పోరు సాగే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఎల్.రమణ మంతనాలు జరిపారు. ఎమ్మెల్సీ పదవి ఇప్పించే బాధ్యత తనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్‌ను దృష్ట్యా టీఆర్ఎస్‌లో చేరాలని ఎల్.రమణ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే హుజూరాబాద్ లో పోటీకి దిగుతారో లేదో మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.
కేసీఆర్ తో భేటీ సందర్భంగా పోటీపై నిర్ణయం తీసుకోవాలని ఎల్.రమణ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీ సీటుపై కేసీఆర్ నుంచి పక్కా హామీ లభించిన తర్వాతే ఎల్.రమణ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, ఇద్దరు బీసీ నేతల మధ్య భారీ పోరు తప్పదన్న టాక్ వినిపిస్తోంది. అదే నేపథ్యంలో ఈటెల, ఎల్. రమణలను ఎదుర్కొనే సత్తా ఉన్నవారిని కాంగ్రెస్ నిలబెట్టాల్సి వస్తుంది.
ఇది కూడా చదవండి ==> పాదయాత్రలకు పార్టీలు రెడీ.. హుజూరాబాద్ గెలుపును పాదయాత్రలు డిసైడ్ చేస్తాయా?
ఇది కూడా చదవండి ==> తాటికొండ వర్సెస్ కడియం.. మళ్లీ మాటల తూటాలు షురూ..!