ట్రెండింగ్ టాపిక్ : ఈటెల, హరీష్, రేవంత్ కొత్త పార్టీ పెడితే..!
Etela Rajendar : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో పెను సంచలనం నమోదు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి ఈటెల రాజేందర్ దాదాపుగా బయట పడ్డట్లే అంటున్నారు. ఇప్పటికే ఆయన్ను మంత్రి పదవి నుండి తొలగించకుండా మంత్రిత్వ శాఖలను తొలగించడం జరిగింది. ఈటెలను పొమ్మనలేక పొగ పెడుతున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈటెల రాజేందర్ పై కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు కొందరు నాయకులు కూడా ఆయన వెంటున్నారు. వారంతా కలిసి పార్టీ పెడతారేమో అనే టాపిక్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీఆర్‌ఎస్‌లో చీలిక…
టీఆర్‌ఎస్ లో మొదటి నుండి కూడా కేసీఆర్ మాటే ఫైనల్. ఆయన్ను కాదని ఏదైనా చిన్న మాట నాయకులు జారితే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈటెల రాజేందర్ విషయంలో కూడా అలాగే జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. ఆయన టీఆర్‌ఎస్ పార్టీ మా అందరిది జెండా ఏ ఒక్కరి సొంతం కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయనకు ప్రస్తుతం ఈ పరిస్థితి కలిగించిందని కొందరు అంటున్నారు. కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ నుండి ఎంతో మంది నాయకులను పొమ్మనలేక పొగబెట్టారు అంటూ విమర్శలు ఉన్నాయి. ఈటెల బయటకు వెళ్తే పార్టీలో పెద్ద చీలిక తప్పక పోవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
త్రిమూర్తులు కలుస్తారా…
తెలంగాణ రాజకీయాల్లో కీలక వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి, హరీష్ రావు మరియు ఈటెల. ఈ ముగ్గురు కూడా కలిసి పార్టీ పెడితే బాగుంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని బలంగా కోరుకుంటున్నారు. కాని ఈ ముగ్గురు కలవడం అంటే దాదాపుగా అసాధ్యం. కాని రాజకీయ వర్గాలు మాత్రం ఈ ముగ్గురిని కలవాలని కోరుకుంటున్నాయట. రాజకీయాల్లో ఈ ముగ్గురి కలయిక కొత్త శకంను ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ముగ్గురు కొత్త పార్టీ పెడితే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది… కాని పెట్టడం కష్టంగా విశ్లేషకులు చెబుతున్నారు.