India : చైనాని అధిగమించి ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్..!!
India : గత కొన్ని దశాబ్దాల నుండి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏది అంటే చైనా అని అందరూ చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. తాజాగా ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం భారత్ అని తేలింది. ఇటీవల జనవరి నెలలో చైనా జనాభాను భారత్ అధిగమించినట్లు గణాంకాలు తెలియజేయడం జరిగింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనాల ప్రకారం 2022 చివరి నాటికి భారతదేశం యొక్క జనాభా 141.7 కోట్లు కాగా ప్రస్తుతం జనవరి 18 నాటికి 142.8 కోట్లుగా ఉందని లెక్కలు తేలాయి.
చైనా జనాభా 141.2 కోట్లు. దీంతో.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గలిగిన దేశంగా రికార్డు సృష్టించినట్లు వార్తలొస్తున్నాయి. చైనాలో ఒకవైపు జననాల రేటు తగ్గటంతో పాటు మరోవైపు వయోవృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో తమ దేశ జనాభా ఫస్ట్ టైం తగ్గిందని అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఈ ఏడాది చివరిలో పూర్తిగా చైనాని దాటేసి భారత్ ఎవరు చేరుకొని స్థానంలో ఉంటుందని టాక్. ఇక 2050 నాటికి భారత్ జనాభా 167 కోట్లు ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తూ ఉంది.
మరోవైపు ప్రపంచ జనాభా 800 కోట్లు దాటడం జరిగింది. గత ఏడాది నవంబర్ 15వ తారీకు ఒక శిశు జన్మించడంతో ఐక్యరాజ్యసమితి ఈ విషయం వెల్లడించడం తెలిసిందే. 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు ఉంటే 48 సంవత్సరాలలో డబల్ కావడం విశేషం. భారత్ వైద్య రంగాలలో పురోగతి సాధించడంతో మరణాలు రేటు తగ్గటంతో పాటు జనాభా పెరుగుదల కారణమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడుతుంది. ఏది ఏమైనా ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన మొదటి దేశంగా భారత్ అవతరించినట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి.