ప్రజలకు ఇంకా ఏదో చేయాలనుంది.. హుజురాబాద్ ఉపఎన్నిక పోటీపై క్లారిటీ ఇచ్చిన ఐపీఎస్ ప్రవీణ్ కుమార్.. !
IPS RS Praveen Kumar : హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఐపీఎస్ అధికారి, సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ IPS RS Praveen Kumar స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చేది లేనిది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా విరామం లేకుండా పనిచేసినందున మొదట కొంత విశ్రాంతి కోరుకుంటున్నానని తెలిపారు. ఆ తర్వాత తన కార్యాచరణ ఉంటుందని… సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని వెల్లడించారు.
తన 26 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎస్ ప్రస్థానంలో తాను చేయగలిగినంత చేశానని ప్రవీణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యూరోక్రాట్‌గా తాను చేసింది కేవలం 1 శాతం మాత్రమేనని… పేద ప్రజల కోసం ఇంకా చాలా చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తన చివరి శ్వాస వరకు అణగారిన వర్గాల కోసమే తన కార్యాచరణ ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో కొన్ని పరిమితులు ఉంటాయని… ఎటువంటి పరిమితులు లేని విశాల ప్రపంచంలో పనిచేసేందుకే తాను పదవి నుంచి బయటకు రావాలనుకుంటున్నానని తెలిపారు.

IPS RS Praveen Kumar Clarity on Huzurabad bypoll
హుజూరా బాద్ బరిలో.. IPS RS Praveen Kumar
తన ఇన్నేళ్ల సర్వీసులో తనతో పాటు కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖలో హోంగార్డు నుంచి డీజీపీ వరకు, గురుకులాల్లో అటెండర్ నుంచి ప్రిన్సిపాల్ వరకూ ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. స్వేరో సంస్థ కొనసాగుతుందా అన్న ప్రశ్నకు…ఈ భూమి ఉన్నంతవరకు ఆ సంస్థ ఉంటుందని అన్నారు. అది ఒక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు చెందినది కాదని… తాను సీనియర్ అయినందున సుప్రీమ్ స్వేరో అనే గౌరవం కట్టబెట్టారని అన్నారు. గురుకుల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆ సంస్థ ఎప్పటికీ ఉంటుందన్నారు.
పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు చేసిన ఎన్‌కౌంటర్లకు ఏమైనా పశ్చాత్తాప పడుతున్నారా అన్న ప్రశ్నకు… దానికి చరిత్ర, భవిష్యత్ సమాధానం చెబుతాయన్నారు. విమర్శలకు కుంగిపోవడం, ప్రశంసలకు పొంగిపోవడం తన నైజం కాదని… పేదల కోసం మరింత గొప్పగా పనిచేసేందుకే ఐపీఎస్ పదవిని వదులుకున్నానని స్పష్టం చేశారు. కాగా,ఆర్ఎస్ ప్రవీణ్ రాజీనామా నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆయన్ను హుజురాబాద్ అభ్యర్థిగా నిలపనుందన్న ప్రచారం తెర పైకి వచ్చింది. తాజాగా ప్రవీణ్ కుమార్ ఇచ్చిన స్పష్టతతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ప్రవీణ్ కుమార్ రాజీనామా లేఖలో మహనీయులు పూలే,అంబేడ్కర్,కాన్షీరాం చూపిన బాటలో పయనిస్తానని పేర్కొనడం గమనార్హం. దీన్నిబట్టి ఆయన భవిష్యత్తులో బహుజన రాజకీయాలు నిర్మించనున్నారన్న చర్చ జరుగుతోంది.
సొంత పార్టీ .. IPS RS Praveen Kumar

IPS RS Praveen Kumar Clarity on Huzurabad bypoll
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. స్వేరో సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. లక్షలాది మంది స్వేరో సైన్యంలో ఉన్నారు. చదువుకున్నవారు, ఉద్యోగాల్లో స్థిరపడిన వారంతా స్వేరోలుగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్వేరో సంస్థలో పనిచేస్తున్న సైన్యాన్ని సమీకరించి కొత్త రాజకీయ పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. తద్వారా అణగారిన వర్గాలకు రాజకీయ అధికారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు.
ఆయన రాజకీయ పార్టీ నెలకొల్పితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యావత్ దళిత సంఘాలన్నీ ఆ పార్టీలో చేరే అవకాశం ఉండొచ్చు. తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ పోరు ఓ లెక్కన నడుస్తోంది. ఇప్పుడిక ప్రవీణ్‌కుమార్ సైతం కొత్త పార్టీ పెడితే.. దళిత వర్గాలకు ప్రతినిధిగా నిలిస్తే.. తెలంగాణ రాజకీయం ఆసక్తికర టర్న్ తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం దళితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలురుగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి రాకతో మరింత ఉత్సాహం పెరిగింది. ఇలాంటి సమయంలో.. దళితులకు రోల్ మోడల్ లాంటి ప్రవీణ్ కుమార్ పార్టీ పెడితే.. ఆ వర్గమంతా కాంగ్రెస్ నుంచి ప్రవీణ్‌కుమార్ వైపు మళ్లడం ఖాయం. అంటే, ప్రవీణ్‌కుమార్ వేయబోయే అడుగులు.. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి ప్రతికూలంగా, టీఆర్ఎస్ కు అనుకూలంగా మారతాయని టాక్ వినిపిస్తోంది.