Raja Gopal Reddy : మును‘గోడు’: గులాబీ పార్టీకి సాయం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.?
Raja Gopal Reddy : కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా, ఆ పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చిన రాజ గోపాల్ రెడ్డి, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఈ విషయమై ముందే సమాచారం ఇచ్చారో ఏమో.. వెంకట రెడ్డి మౌనంగా వున్నారు తన సోదరుడు రాజ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనుండడంపై. ‘మా ఇద్దరి రాజకీయ ప్రయాణం వేరు.. కానీ, ఆలోచనలు ఒకటే..’ అని చిరంజీవి కొన్నాళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి, తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. అలాగే వుంది కోమటిరెడ్డి సోదరుల తీరు. అయితే, చిరంజీవి రాజకీయాలకు దూరంగా వున్నారు.
కానీ, వెంకట రెడ్డి, రాజ గోపాల్ రెడ్డి.. ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో వున్నారు.. ప్రజా ప్రతినిథులుగానూ వున్నారు. పైగా, ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. ఇకపై ఇద్దరి ప్రయాణాలూ వేరు కానున్నాయి. అయితే, ఇద్దరిదీ గమ్యం ఒకటేనని కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి అంటున్నారు. మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయంటూ కొన్నాళ్ళ క్రితం ప్రచారం జరిగితే, దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న దుష్ప్రచారంగా రాజ గోపాల్ రెడ్డి కొట్టి పారేశారు. కానీ, ఆయనే ఇప్పుడు మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందంటున్నారు. కేసీయార్ రాజకీయంగా పతనమవడమే తన రాజకీయ లక్ష్యమని కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం అయితే, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అంటే, దానికి ఇంకా ఏడాదిన్నర సమయం పూర్తిగా లేదు.
ఈలోగా మునుగోడుకి ఉప ఎన్నిక వస్తే.? అది కాస్తంత చిత్రమైన వ్యవహారమే అవుతుంది. రాజ గోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే, దాన్ని ఆమోదించడం అనేది అధికార పార్టీ వ్యూహాన్ని బట్టి వుంటుంది. ఇది బహిరంగ రహస్యం. ఇప్పుడు రాజీనామా చేస్తే, ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరగాల్సి వుంటుంది. కానీ, షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలకు 9 నెలల ముందు ఉప ఎన్నిక జరగడం అనేది దాదాపుగా జరిగే పని కాదు. ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే, తెలంగాణ రాష్ట్ర సమితికే లాభం. ఎలా చూసినా, కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి రాజకీయ వ్యూహం బీజేపీకో లేదా కాంగ్రెస్ పార్టీకో లాభించేలా కుండా, గులాబీ పార్టీకి లాభించేలానే కనిపిస్తోంది.