Adhire Abhi : ఆ ఇద్దరూ లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని.. ఎమోషనల్ అయిన అధిరే అభి?
Adhire Abhi : జబర్దస్త్ అధిరే అభి గురించి తెలుసు కదా. ఆయన జబర్దస్త్ లో చాలా సంవత్సరాల నుంచి స్కిట్లు చేస్తున్నాడు. అంతే కాదు.. ఆయన పలు సినిమాల్లో కూడా నటించాడు. ఆయన తొలి సినిమా ప్రభాస్ నటించిన ఈశ్వర్. ఆ సినిమాతోనే ఇద్దరూ ఒకేసారి వెండి తెరకు పరిచయం అయ్యారు. అధిరే అభి.. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. కొన్ని రోజులు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేశాడు అభి.
ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు షోలలో పాల్గొంటున్నాడు. తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ లో తన చెల్లితో పాటు హాజరు అయ్యాడు అభి. ఈ సందర్భంగా తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పుకోని తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ అందరినీ ఎంతో భయాందోళనకు గురి చేసింది. సెకండ్ వేవ్ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. చాలామంది జబర్దస్త్ నటులకు కూడా కరోనా సోకింది. అధిరే అభికి కూడా కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా సోకిందట.
Adhire Abhi : క్యాష్ షోలో ఎమోషనల్ అయిన అభి
అధిరే అభికి కరోనా రావడమే కాదు.. లక్షణాలు కూడా సీరియస్ గా ఉండటంతో ఆసుపత్రికి వెళ్లలేక.. ఇంట్లోనే ఉండాలనుకున్నాడట. కానీ.. తన తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో వాళ్లతో ఉంటే వాళ్లకు కూడా వస్తుందేమోనని.. తన తల్లిదండ్రులను తన చెల్లెలు ఇంటికి పంపించాడట. తన చెల్లె కూడా అప్పుడే దుబాయ్ నుంచి వచ్చిందట. తనకు కరోనా వచ్చిందని తెలిసి.. తన భర్తను, తన పిల్లలను, తన తల్లిదండ్రులను అందరినీ వదిలేసి.. ఇంటికి వచ్చి తనతో పాటే 15 రోజులు ఉండి అన్నీ వండి పెట్టిందట అభికి. తన చెల్లితో పాటు తన తమ్ముడు కూడా ఉండి.. ఇద్దరూ కలిసి 15 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారట. వాళ్లకు కరోనా వస్తుందని తెలిసినా కూడా తన మీద ఉన్న ప్రేమతో తనతోనే ఉన్నారట. రాత్రి పడుకునేటప్పుడు డోర్ కు లాక్ కూడా వేయకుండా పడుకునేవాడట అభి. ఒకవేళ రాత్రి ఏదైనా అయితే డోర్ తీయడానికి సమయం పడుతుంది కదా అని.. డోర్ లాక్ చేసుకోకుండానే పడుకునేవాడట. అలా.. తన తమ్ముడు, చెల్లి ఇద్దరూ ఉండి తనకు సపర్యలు చేయడం వల్లే తను ఇప్పుడు బతికి బయటపడ్డానని.. వాళ్లు లేకుండా నేను అప్పుడే చచ్చిపోయేవాడినని.. క్యాష్ ప్రోగ్రామ్ లో ఎమోషనల్ అయ్యాడు అభి. దానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రస్తుతం యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.