Birds lover : అతని ఇంటి ఆవరణమే పక్షులకు ఆవాసం.. అన్నితానై పక్షులను ఆదుకుంటున్న రమేష్
Birds lover : ఒకప్పుడు తెల్లవారితే అందమైన పక్షలు కిచకిచమంటూ సందడి చేసేవి. పల్లెటూళ్లలో ఇంటి చూరులో, వాసాల్లో, కొన్ని చోట్ల ఇంటికి కట్టిన గుమ్మడికాయపైన, పాత కుండలలో ఇలా ఎక్కడో ఒక చోట నివాసం ఏర్పర్చుకునేవి. ఉదయం, సాయంత్రం ఆహ్లాదాన్ని పంచేవి. తెలంగాణ సంస్కృతిలోనే పిచ్చుకలు ఒక భాగంగా ఉండేవి. ఒకప్పుడు ఇంటి వాసాలకే పిచ్చుకల కోసం గూళ్లు కట్టేవారు. గ్రామాల్లో ఇప్పటికీ దసరా పండగ రోజు వరి పైరు తీసుకొచ్చి పక్షల కోసం గుమ్మాలకు కడతారు. పాల పిట్టను చూడటానికి ఇష్టపడతారు. ప్రస్తుతం ఆ పాల పిట్ట జాడ కూడా కనిపించడంలేదు.ప్రస్తుతం పెంకుటిళ్లు మాయమై పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఎక్కువయ్యాయి. పట్టణీకరణ, కాలుష్యం, సెల్‌ఫోన్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించే దశకు చేరుకున్నాయి.
కృత్రిమ గూళ్లతో రక్షిస్తే వీటిజాతిని కాపాడుకోవచ్చంటున్న శాస్త్రవేత్తల పిలుపుతో కరీంనగర్‌లో కొంతమంది పక్షి ప్రేమికులు పిచ్చుకలను కాపాడుకునేందుకు తమవంతు కృషి చేస్తున్నారు.అయితే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ పక్షిప్రేమికుడు అంతరించిపోతున్న పక్షులు, పిచ్చుకలపై ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు. కాలుష్యం నుంచి పక్షి జాతిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటున్నాడు కరీంనగర్ కు చెందిన రమేష్. పిచ్చుకలను స్వేచ్ఛగా బతికేందుకు వినూత్నంగా ఆలోచించి వాటి కోసం ప్రత్యేక నివాసాలను తయారు చేశాడు. ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేయడం కారణంగా పిచ్చుకలకు నిలువ నీడ లేకుండాపోవడంతో తన ఇంటినే వాటికి ఆవాసంగా మార్చాడు.వాటికి ఇష్టమైన ఆహారం, అనుకూలంగా ఉండే వాతావరణం కల్పించాలని అనుకున్నాడు.పిచ్చుకలు వాయు కాలుష్యం బారిన పడకుండా ఖాళీ నూనె డబ్బాలతో పక్షలు నివసించేందుకు
bird lover; అనుకూల వాతావరణం ఏర్పాటు చేసి..
అందమైన గూళ్లను తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేశాడు. ఖాళీ నూనె డబ్బా తీసుకొని నాలుగు వైపులా కట్ చేసి ఆ డబ్బా నాలుగు కొసలను కొంచెం వంచి అందులో గింజలు వేశాడు. మధ్యలో నీరు పోసి పక్షల దాహం తీర్చేందుకు ప్రయత్నం చేశాడు.తన ఇంటి వద్దే పిచ్చుకల కోసం అవసరమైన గింజలు, నీరు, వరి గొలుసులను ఏర్పాటు చేశాడు. అలాగే పిచ్చుకలు గూళ్లు కట్టుకోవడానికి వీలుగా గడ్డిని అందుబాటులో ఉంచాడు. పక్షలకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరకడం వల్ల అక్కడకు వచ్చే పక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, నాలుగు పక్షుల ఆకలి తీర్చుకోవడం సంతృప్తిగా ఉందని రమేష్ ఆనందం వ్యక్తం చేశాడు.ప్రతి ఒక్కరూ ఇలా ఇంటి అవరణంలో పిచ్చుకల కోసం ధాన్యం గింజలు, నీటిని సమకూరిస్తే పక్షి జాతిని కాపాడుకొనే అవకాశం ఉంటుంది. మనం చేసే ఈ చిన్నపనికి ఎన్నో పిచ్చుకలు ఆనందంగా జీవిస్తాయి.. ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మీరు కూడా ఇలా చేస్తారు కదూ..