KCR : కేసీయార్‌కి జాతీయ నాయకుల నుంచి మద్దతు లభించట్లేదేం.?
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, జాతీయ నాయకుల నుంచి మద్దతు పొందలేకపోతున్నారెందుకు.? ఈ ప్రశ్న ఇప్పుడు గులాబీ శ్రేణుల్లోనే ఒకింత అయోమయాన్ని పెంచుతోంది. ‘జాతీయ రాజకీయాల్లోకి పోదామా.?’ అంటూ తెలంగాణ సమాజాన్ని పదే పదే అడుగుతున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీయార్. భారతీయ జనతా పార్టీ మీద ఘాటైన విమర్శలు చేస్తూ, ఆ పార్టీని అధికారంలోంచి దించేస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు కేసీయార్. కానీ, ఎలా.? తెలంగాణలో వున్న లోక్ సభ సీట్లెన్ని.? జాతీయ రాజకీయాలపై కేసీయార్ ప్రభావమెంత.? ఇవేవీ కేసీయార్ తెలుసుకోలేనంత అమాయకుడైతే కాదు కదా.! కానీ, కేసీయార్..
తెలంగాణ సమాజంలో తనదైన ముద్ర ఇంకా బలంగా వేయాలన్న కోణంలోనే.. బీజేపీని బూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటే టాస్క్.. పొరుగు రాష్ట్రం కర్నాటకలో పెట్రోల్, డీజిల్ ధరలెంత.? తెలంగాణలో వాటి ధరలెంత.? ఇదొక్కటి చాలు, కేసీయార్ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారనడానికి.. అన్న చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది. పెట్రో ధరలపై పన్నులు పెంచింది కేంద్రం, తగ్గించాల్సిందీ కేంద్రమే.. అంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి. అందులోనూ నిజం లేకపోలేదు. అలా పన్నులు పెంచడం ద్వారా తెలంగాణకూ అదనంగా ఆదాయం లభిస్తోంది కదా.? సరే, ఈ లెక్కలెలా వున్నా.. జాతీయ స్థాయిలో కొత్త ప్రత్యామ్నాయం.. అంటోన్న కేసీయార్ వెంట నడిచేందుకు జాతీయ నాయకులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
ఎవరికి వారు తమ తమ రాష్ట్రాల్లో బీజేపీ కారణంగా రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్లో సతమతమవుతున్న ఆయా నేతలు, కొత్త ప్రత్యామ్నాయం గురించి ఆలోచించలేకపోతున్నారు. పైగా, కేసీయార్.. మాట మీద నిలబడే రకం కాదు. పూటకో మాట మార్చే రకం.. అందుకే ఆయన్ని ఎవరూ నమ్మడంలేదన్న భావన కూడా రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఇదంతా 2023 అసెంబ్లీ ఎన్నికల వరకే.. ఆ తర్వాత కేసీయార్, బీజేపీతో కలిసిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనా లేకపోలేదు.