KCR : నీతి అయోగ్‌పై దుమ్మెత్తి పోసిన కేసీయార్.!

KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా మీడియా ముందుకొచ్చారు. ఈసారి నీతి అయోగ్ మీద విమర్శలు చేయడానికే ప్రెస్ మీట్ మొత్తాన్నీ వాడేశారు కేసీయార్. నీతి అయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలిపిన కేసీయార్, నరేంద్ర మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా నీతి అయోగ్ తెచ్చిందనీ, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి.. నీతి అయోగ్ తెస్తే మంచి జరుగుతుందని తామూ అనుకున్నామనీ, కానీ.. మంచి జరగలేదు సరికదా చెడు ఎక్కువ జరిగిందనీ కేసీయార్ చెప్పుకొచ్చారు.

Advertisement

ప్రణాళికా సంఘం దగ్గర సరైన ప్రణాళిక వుండేదనీ, నీతి అయోగ్ దగ్గర ప్రణాళిక వుండదనీ, రాష్ట్రాల అభిప్రాయాలు కోరడం వరకే తప్ప, ఆ అభిప్రాయాలకు అక్కడ విలువ వుండదని కేసీయార్ చెప్పుకొచ్చారు. నీతి అయోగ్ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్ళడం ఖర్చు దండగ వ్యవహారమని కేసీయార్ విమర్శించడం గమనార్హం. ‘వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏ సమస్యలు వున్నాయో నాకు తెలియదు. నా రాష్ట్రానికి వున్న సమస్యల్ని నేను మాట్లాడతాను. దేశ పౌరుడిగా, దేశానికి జరుగుతున్న అన్యాయం గురించి కూడా మాట్లాడతాను..’ అంటూ కేసీయార్ ఈసారి ఒకింత భిన్నంగా వ్యాఖ్యానించారు.

Advertisement
KCR Hits Hard At Narendra Modi Govt
KCR Hits Hard At Narendra Modi Govt

రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తోందనీ, అప్పులు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తోందనీ కేసీయార్ విమర్శించారు. వృద్ధులకు పెన్షన్లు ఇస్తోంటే, ఉచితాలెందుకని కేంద్రం ఆక్షేపిస్తోందన్న కేసీయార్, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. 5జి స్పెక్ట్రమ్ వేలంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని కేసీయార్ సంచలన ఆరోపణలు చేయడం ఈ ప్రెస్ మీట్ మొత్తానికీ హైలైట్ అంశంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రాల్లో అధికారంలో వున్న బీజేపీయేతర పార్టీలపై రాజకీయ కుట్రలు చేస్తోన్న కేంద్రం, దేశంలో ఒకే ఒక్క పార్టీ అధికారంలో వుండాలనే దిశగా వేధింపులకు పాల్పడుతోందని అసహనం వ్యక్తం చేశారు.

Advertisement