KCR : కేసీఆర్ జాతీయ ఆలోచనలు ముందుకు కదలడంలేదెందుకు.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : కేసీఆర్ జాతీయ ఆలోచనలు ముందుకు కదలడంలేదెందుకు.?

 Authored By prabhas | The Telugu News | Updated on :4 June 2022,7:00 am

KCR  : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టి చాలాకాలమే అయ్యింది. ఇదిగో పులి అంటే.. అదిగో తోక.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ‘మీ ఆశీర్వాదం వుంటే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదాం.. తెలంగాణ నుంచే దేశాన్ని మార్చే శక్తి తయారవుతుంది..’ అంటూ తనను తాను ప్రధాని అభ్యర్థిగా తెలంగాణ ప్రజల దృష్టిలో ఓ ముద్ర వేసెయ్యాలని కేసీయార్ చాలా ప్రయత్నించారు. వాగ్ధాటి విషయంలో కేసీయార్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? తిమ్మిని బమ్మిని చేయగల వాక్చాతుర్యం ఆయన సొంతం.జాతీయ రాజకీయాల పట్ల కేసీయార్‌కి అవగాహన వుంది. దాన్ని కాదనలేం.

అయితే, దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే శక్తి తెలంగాణ రాష్ట్ర సమితికి లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అయితే, మొత్తంగా చూసుకున్నప్పుడు సంఖ్యా బలం పరంగా చాలా బలంగా వుండేది తెలుగు నేల. ఇప్పుడు పరిస్థితి అది కాదు. పార్లమెంటు సభ్యుల పరంగా చూసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ చిన్న రాష్ట్రం. అలాంటప్పుడు, తెలంగాణ తొలుత ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీతోనో, జనసేన లేదా టీడీపీ లాంటి పార్టీలతోనో మంతనాలు జరిపి వుండాలి. కానీ, అలా చేయలేదు తెలంగాణ రాష్ట్ర సమితి. వైసీపీతో గతంలో టచ్‌లోకి వెళ్ళినా, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రెండూ కలిసి, తమ ఉమ్మడి సమస్యలపై కేంద్రాన్ని నిలదీసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రద్ధ, ఆసక్తి చూపలేకపోయింది.

KCR National ideas moving forward

KCR National ideas moving forward

ఇలాంటి తప్పిదాలన్నీ చేసేసి, ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేయాలనుకుంటే ఎలా.? అది సాధ్యమయ్యే పని కానే కాదు. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. వైసీపీతో కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి ఉమ్మడి కార్యాచరణ తెలుగు నేల నుంచి మొదలు పెడితే, మిగతా రాష్ట్రాలూ కలిసొచ్చే అవకాశం వుంటుందేమో. లేదూ, ఇలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ కేసీయార్ ‘జాతీయ రాజకీయం’ పేరుతో కాలక్షేపం చేయాలనుకుంటే, ఇక అనుకోవడానికేమీ వుండదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అనే స్థాయిలో కేసీయార్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాల్సి వుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది