Insider Talk : కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్.. ఎవరికి పీసీసీ పగ్గాలు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Insider Talk : కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్.. ఎవరికి పీసీసీ పగ్గాలు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 December 2020,10:24 am

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చర్చ ఒకటే. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఉత్తమ్ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎవరు లీడ్ చేయబోతున్నారు. దశాబ్దాల పాటు తెలంగాణను పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం అయిపోతుందా? లేక మళ్లీ పునరుజ్జీవనం పొందుతుందా? అనేది వచ్చే టీపీసీసీ మీదే ఆధారపడి ఉంది. అందుకే.. తదుపరి టీపీసీసీ చీఫ్ ఎవరు అవుతారు? అనేదానిపై జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.

komatireddy venkat reddy versus revanth reddy who will be the tpcc chief

komatireddy venkat reddy versus revanth reddy, who will be the tpcc chief

నిజానికి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన నాయకుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలదొక్కుకోలేకపోతోంది. మేమే తెలంగాణను తీసుకొచ్చాం.. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే.. నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందే కాంగ్రెస్ పార్టీ.. అంటూ ప్రజల్లోకి వెళ్లినా కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మాత్రం తెలంగాణ ప్రజలు గెలిపించడం లేదు.

ఈనేపథ్యంలో టీపీసీసీ చీఫ్ గా నిఖార్సయిన నాయకుడిని ఎన్నుకొని.. పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసి.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది కాంగ్రెస్. అందుకే.. ఉత్తమ్ రాజీనామా తర్వాత ఎవరికి పగ్గాలు అప్పజెప్పాలి అనేదానిపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆలోచనలో పడింది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే ఓటేస్తున్న ముఖ్య నేతలు

టీపీసీసీ చీఫ్ ఎవరు.. అనగానే ముందుగా గుర్తొస్తున్న పేరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా సీనియర్ కాంగ్రెస్ నేత. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కోమటిరెడ్డి మంత్రిగానూ పనిచేశారు. అంతే కాదు.. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో… 2010 లో తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్ష కూడా చేసి తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోమటిరెడ్డి. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డికి ఉన్న ఫాలోయింగే వేరు. అలాగే.. తెలంగాణలో ఉన్న అతికొద్ది మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో కోమటిరెడ్డి ఒకరు. అందుకే.. కోమటిరెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తే.. పార్టీని గాడిలో పెడతారని.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా పార్టీని తీర్చిదిద్దుతారని కొందరు కాంగ్రెస్ ముఖ్యనేతలు భావిస్తున్నారు. మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కోమటిరెడ్డివైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి

తెలంగాణలో కోమటిరెడ్డికి ఎంత ఫేమ్ ఉందో… యంగ్ అండ్ డైనమిక్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కూడా అంతే ఫేమ్ ఉంది. అందులోనూ డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటిషియన్ అని రేవంత్ కు పేరు. రేవంత్ కు పీసీసీ చీఫ్ కావాలనేది పెద్ద కల. దాని కోసం చాలారోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అలాగే… కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

రేవంత్ రెడ్డి కూడా టీపీసీసీ చీఫ్ గా ఎన్నికవడానికి అన్ని రకాలుగా అర్హుడే. కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ కూడా రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నట్టు ఇన్ సైడర్ టాక్.

కానీ.. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తే.. ప్రధానంగా మూడు సమస్యలు వచ్చే అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తోంది. ఒకటి.. రేవంత్ రెడ్డిపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఒకవేళ పీసీసీ చీఫ్ గా రేవంత్ ను చేసి సీఎం కేసీఆర్ మీదికి ఉసగొల్పితే.. సీఎం కేసీఆర్.. రేవంత్ కేసులను తవ్వితీసి.. జైలుకు పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని హైకమాండ్ కూడా గ్రహించిందట. ఒకవేళ రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఇస్తే.. కావాలని కేసీఆర్ ను రెచ్చగొట్టినట్టే అవుతుందని… కేసీఆర్ కు, రేవంత్ కు మొదటి నుంచి పడదు.. అనే విషయం జగమెరిగిన సత్యమేనని.. ఎప్పుడు రేవంత్ దొరికితే అప్పుడు పట్టుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో హైకమాండ్ రేవంత్ విషయంలో వెనుకడుగు వేస్తున్నట్టు ఇన్ సైడర్ టాక్.

అలాగే.. రేవంత్ రెడ్డి కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నేతలున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో కొనసాగుతున్న నేతలు ఉన్నారు. సీనియార్టీ ప్రకారం చూసుకుంటే… రేవంత్ రెడ్డే అందరికన్నా జూనియర్. పార్టీలో అంతమంది సీనియర్లు ఉండగా.. నిన్నకాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పజెప్పడం కరెక్ట్ కాదని పార్టీ ముఖ్యుల్లో అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. మొన్న దుబ్బాక ఉపఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం చెందింది. రేవంత్ రెడ్డి.. ఈ రెండు ఎన్నికల్లో ప్రచారం చేసినా కూడా పార్టీని గెలిపించలేకపోయారని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే కేవలం 2 సీట్లే రావడంపై హైకమాండ్ రేవంత్ మీద కొద్దిగా అసంతృప్తితో ఉందని.. ఈ కారణాల వల్లనే రేవంత్ కంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్టుగా ఇన్ సైడర్ టాక్.

చూద్దాం మరి.. కాంగ్రెస్ అధిష్ఠానం.. ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో? ఎవరికి పీసీసీ పగ్గాలు అందజేస్తుందో?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది