Huzurabad bypoll : హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో చెప్పేసిన కోమటిరెడ్డి.. పక్కా ఆయనదే గెలుపంటూ ప్రకటన
Huzurabad bypoll : హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిందే అన్న పట్టుదలతో ఉంది. ఎందుకంటే.. అదే పార్టీకి చెందిన ముఖ్య నేత ఈటల రాజేందర్.. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో.. ఆయన్ను ఓడించి.. టీఆర్ఎస్ పార్టీపై హుజూరాబాద్ ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేయాలని.. టీఆర్ఎస్ పార్టీ తెగ ప్రయత్నిస్తోంది.
ఇక.. ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. అక్కడ రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. ప్రచారాలు, హామీలు, పథకాలు, వలసలు.. ఇలా హుజూరాబాద్ లో ఎక్కడ చూసినా రాజకీయాలు మాత్రం చాలా హీట్ ను పెంచుతున్నాయి. దీంతో పోరు రసవత్తరంగా మారింది. అయితే.. టీఆర్ఎస్ పార్టీ ఇంకా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా ప్రకటించలేదు. ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే తమ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ప్రకటించింది. ఇప్పటికే ఈటల రాజేందర్ ప్రచారంలో మునిగిపోయారు. నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు.
Huzurabad bypoll : హుజూరాబాద్ ఉపఎన్నికపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు వైరల్
ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో ఎవరు గెలుస్తారో చెప్పేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుస్తారని జోస్యం చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం నేను సర్వే చేయించా. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు 67 శాతం ఓట్లు పోల్ కానున్నాయి. ఇక.. టీఆర్ఎస్ పార్టీకి 30 శాతం ఓట్లు రాగా… మా సొంత పార్టీ కాంగ్రెస్ కు 5 శాతం లోపు మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఇంకా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి.. వెంటనే అభ్యర్థిని ప్రకటించి.. ప్రచారాన్ని మొదలు పెడితే.. కాస్త మార్పు ఉండొచ్చు.. అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. వెంకట్ రెడ్డి హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి పై వ్యాఖ్యలు చేశారు. అయితే.. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. తన సొంత పార్టీ గెలుస్తుందని చెప్పకుండా.. వేరే పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పడం ఏంది? పైగా ఒక ఎంపీ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ .. అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.