తెలంగాణలో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు… కానీ… !
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మే 12 నుంచి తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రభుత్వం విధించింది. ముందుగా పది రోజులు అనుకున్నా.. ఆ తర్వాత లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించింది. లాక్ డౌన్ కు ఇవాళే చివరి తేదీ కావడంతో.. రాష్ట్ర కేబినేట్ ఇవాళ సమావేశమైంది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర కేబినేట్ సమావేశమై.. లాక్ డౌన్ పొడిగింపుపై, సడలింపు సమయంపై చర్చించింది. ఈ సమావేశంలో కరోనా నియంత్రణ చర్యలపై కేబినేట్ చర్చించింది. అయితే.. ఇంకా తెలంగాణలో కేసులు తగ్గకపోవడంతో.. లాక్ డౌన్ ను జూన్ 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
సడలింపు సమయాన్ని మరో మూడు గంటలు పెంచిన ప్రభుత్వం
అయితే.. ప్రస్తుతం సడలింపు సమయం ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే ఉంది. అయితే కేవలం 4 గంటల్లో ఏవైనా పనులు చేసుకోవాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే.. ఏ పనీ చేయలేకపోతున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలులోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో.. ఈ విషయంపై దృష్టి సారించిన ప్రభుత్వం.. సడలింపు సమయాన్ని పెంచింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమయాన్ని పెంచారు. దీంతో 7 గంటల పాటు లాక్ డౌన్ సడలింపు ఉంటుంది.
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఇళ్లకు చేరుకోవడానికి సమయం
అయితే.. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే షాపులు కానీ.. ఇతర నిత్యావసర సరుకులు కానీ కొనుక్కోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1 తర్వాత షాపులన్నీ బంద్ అయిపోతాయి. అయితే.. ప్రజలు మాత్రం తమ ఇంటికి వెళ్లడానికి మరో గంట అదనపు సమయాన్ని ఇచ్చింది ప్రభుత్వం. అంటే.. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల లోపున ప్రజలంతా తమ ఇళ్లలోకి చేరుకోవాల్సి ఉంటుంది. అంటే.. మధ్యాహ్నం 2 నుంచి తెల్లారి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ మాత్రం కఠినంగా అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.