Roja : మరో వివాదంలో రోజా.. శ్రీకాళహస్తిలో ఆ తప్పుడు పని చేసిందా?
Roja : ఇటీవల ఏపి మంత్రులు వరుస వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. వారికి సంబందించి ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఎవరు లెక్కచేయడం లేదు. ఇటీవల మంత్రి రోజా తిరుమల కేంద్రంగా విమర్శలకు కారణమయ్యారు. రోజా 30 మంది అనుచరులతో కలిసి దర్శనానికి వెళ్లారు. అందులో పది మందికి టీటీడీ ప్రోటోకాల్ దర్శనం….మరో 20 మందికి బ్రేక్ దర్శనం అవకాశం కల్పించారు. తనతో పాటుగా వచ్చిన అనుచరులు దర్శనం పూర్తి చేసుకొనే వరకూ మంత్రి రోజా ఆలయ ప్రాంగణంలోనే ఉన్నారు. మంత్రులతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఈ వివాదంపై చర్చలు నడుస్తున్న సమయంలో రోజా మరో వివాదంలో ఇరుక్కున్నట్టు తెలుస్తుంది.
Roja : నిజమెంత?
దక్షిణ కాశి క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయంలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.భూతనాధుడి ఆలయంలో ఆలయ అర్చకులు వెలిగించే దీపాలు మినహా.. భక్తులు దీపాలు వెంట తెచ్చుకోవద్దు . విఐపిల విషయంలో అందుకు బిన్నంగా ఈ ఆచార వ్యవహారాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి రోజా చర్య తీవ్రవిమర్శలకు తావిస్తోంది. మంగళవారం నాడు రాహుకేతు సర్పదోష నివారణార్థం శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చారు. ముక్కంటి దర్శనానికి ముందుగా మంత్రి రోజా సహస్రలింగేశ్వర సన్నిధి వద్ద రాహు కేతు దోష నివారణ పూజ నిర్వహించారు.
దోష నివారణ పూజ అనంతరం స్వామి., అమ్మవార్లకు నిర్వహించే రుద్రాభిషేక పూజలో పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నిర్వహించే దీపారాధన పూజలో పాల్గొన్నారు. కాలభైరవ స్వామి వారికీ అభిషేకం చేయించారు. అభిషేక ఆరాధన జరుగుతున్న సమయంలో తన వెంట తెచ్చుకున్న గుమ్మడి కాయతో నేతి దీపాలు వెలిగించారు. అభిషేకం అయ్యే వరకు తనముందే దీపాలను ఉంచుకొని అభిషేకం అయ్యిన వెంటనే వాటిని అర్చకుల వద్దకు ఇచ్చి హారతి ఇవ్వమని చెప్పారు. దంతా ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఉన్న సమయంలోనే జరగటం విశేషం. ఇదంతా ఆలయ నిబంధనలకు విరుద్ధమైనా అన్నీ తెలిసిన మంత్రిగానీ, అధికారులు, అర్చకులు పట్టించుకోలేదు.దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.