Chandrababu : మళ్ళీ చంద్రబాబు గూటికి మోహన్‌బాబు.?
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో సినీ నటుడు, నిర్మాత మోహన్‌బాబు భేటీ అవడం అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యింది. ఈ ఇద్దరి కలయికకీ అంత ప్రాధాన్యత వుండడం సహజమే. ఎందుకంటే, 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుపై నానా రకాల విమర్శలూ చేశారు మోహన్‌బాబు. చంద్రబాబుని మోసగాడిగా కూడా అభివర్ణించారాయన. మరి, ఇప్పుడు ఏ అవసరంతో మోహన్‌బాబు తన పాత మిత్రుడు చంద్రబాబుని కలిసినట్లు.? 2019 ఎన్నికల సమయంలో మోహన్‌బాబు ఆయన తనయుడు మంచు విష్ణు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఆ సమయంలో టీడీపీ మీద చంద్రబాబు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
రాజ్యసభ సీటుని మోహన్‌బాబు ఆశించారనీ, టీటీడీ ఛైర్మన్‌గిరీని కూడా ఆశించారనీ అప్పట్లో ప్రచారం జరిగింది. ‘పదవుల కోసం నేను పని చేయను..’ అని పదే పదే మోహన్‌బాబు చెబుతుంటారు. అయితే, ఆయన గతంలో ఓ సారి రాజ్యసభ సభ్యుడిగా టీడీపీ నుంచే అవకాశం దక్కించుకున్న విషయం విదితమే. చంద్రబాబు – మోహన్‌బాబు భేటీ గురించి సినీ, రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మర్యాదపూర్వక భేటీ అని కొందరు, రాజకీయ అవసరాల కోసం జరిగిన భేటీ అని ఇంకొందరూ అంటున్నారు. ఇందులో ఏది నిజం.? ఒకవేళ మోహన్‌బాబు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కోపంతో చంద్రబాబు పంచన మళ్ళీ చేరడంలేదు కదా.? అన్నది ఓ అనుమానం.
రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరు. అసలు, రాజకీయాల్లో మాట మీద నిలబడటం.. అన్న మాటకే అర్థం లేదు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అయితే, ఇది రాజకీయ భేటీనా.? కాదా.? అన్నదానిపై మోహన్‌బాబు తొలుత స్పష్టత ఇవ్వాల్సింది. కాగా, మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మితోనూ చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారట. ఆ విషయాన్ని ‘లీడర్’ అంటూ మంచు లక్స్మి ట్వీట్ ద్వారా ప్రకటించడం గమనార్హం. అయితే, మోహన్‌బాబు – చంద్రబాబు భేటీ గురించి వైసీపీ వర్గాలు పెద్దగా పట్టించుకోవడంలేదు. కానీ, ఈ బేటీ పేరు చెప్పి, వైసీపీ మీద విమర్శలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.