Nara Lokesh Received Honor : మోడీ తరువాత ఆ ఘనత సాధించిన నేత లోకేషే
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ (SVP) లో పాల్గొనాలని ఆస్ట్రేలియా హైకమిషన్ ప్రత్యేక ఆహ్వానం అందించింది. ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ నారా లోకేష్‌కు లేఖ రాసి ఈ ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్య, ఐటీ, మానవ వనరులు, ఆర్థికాభివృద్ధి రంగాల్లో సాధించిన పురోగతిని ప్రశంసించారు.

Nara Lokesh Received Honor
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఆక్వాకల్చర్, ఐటీ రంగం వంటి అంశాలపై లోకేష్ చర్చించనున్నారు. అంతర్జాతీయ వేదికపై ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలను వివరించి పెట్టుబడులు రాబట్టే అవకాశాన్ని ఈ పర్యటన కల్పించనుంది.
గత 20 ఏళ్లలో భారత్‌కు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి ఆహ్వానం పొందగా, 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు అదే వేదికలో నారా లోకేష్ పాల్గొనడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో ఏపీ–ఆస్ట్రేలియా సహకారం పెరగడానికి ఈ పర్యటన దోహదం చేస్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణమని, ఈ అవకాశాన్ని ఏపీ అభివృద్ధి దిశగా మలుచుకుంటానని ఆయన పేర్కొన్నారు.