Narendra Modi : దేశంలో జమిలి పంచాయితీ.! వున్నట్టా.? లేనట్టా.?
Narendra Modi : భారతదేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా.? అన్న ప్రశ్న చుట్టూ చాలాకాలంగా చర్చ జరుగుతోంది. కానీ, ‘జమిలి’ విషయమై అడుగు ముందుకు పడటంలేదు. ఇదిగో జమిలి ఎన్నికలు.. అదిగో జమిలి ఎన్నికలంటూ ఏళ్ళు గడిచిపోతున్నాయి. తాజాగా పార్లమెంటులో జమిలి ఎన్నికలపై కేంద్రం ఇంకోసారి స్పష్టతనిచ్చింది. జమిలి ఎన్నికల దిశగా ఆలోచనలు జరుగుతున్నాయనీ, కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి పని చేస్తున్నామనీ, న్యాయ శాఖ ఈ అంశాన్ని పరిశీలిస్తోందనీ కేంద్రం, పార్లమెంటు వేదికగా సమాధానమిచ్చింది. దాంతో, జమిలి అంశం ఇంకోసారి చర్చకు వచ్చింది. అసలు జమిలి ఎన్నికలంటే ఏంటి.? జమిలి ఎన్నికల వల్ల లాభ నష్టాలేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
జమిలి ఎన్నికలంటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరగడం. అదీ దేశవ్యాప్తంగా ఒకేసారి జరగడం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎప్పుడూ జమిలి ఎన్నికలే జరిగాయి. అయితే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. దాంతో, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఓ సారి, పార్లమెంటు ఎన్నికలు ఓ సారి జరుగుతున్నాయి. ఇదిలా వుంటే, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాల్లో అయితే పార్లమెంటు ఎన్నికలకీ, అసెంబ్లీ ఎన్నికలకీ మధ్య చాలా దూరం వుంటోంది. దేశంలో చాలా రాష్టాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు విడివిడిగా జరగడం వల్ల, ఎప్పుడూ దేశంలో ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి.
తద్వారా ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలకు ఎన్నికల కోడ్ అడ్డం రావడం సహా అనేక సమస్యలు, దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే, జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే, ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దయిపోయి, మళ్ళీ ఎన్నికలు జరగాల్సి వస్తుంది. దానికి ఏ రాష్ట్రమూ ఒప్పుకోదు.
పైగా, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటైతే, ఏ ప్రభుత్వం ఎన్నాళ్ళు అధికారంలో వుంటుందో తెలియని పరిస్థితి. ఎలా చూసినా జమిలి అనేది అంత తేలికైన విషయం కాదు. కానీ, జమిలి పేరుతో పబ్లిసిటీ స్టంట్లు అయితే అలాగే కొనసాగుతూనే వున్నాయి.