KCR : జాతీయ పార్టీ.. కేసీయార్‌కి రెండేళ్ళు సరిపోతాయా.?
KCR : భారత రాష్ట్ర సమితి పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నారట. ఈ అంశంపై గత కొద్ది రోజులుగా మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘కేసీయార్, జాతీయ రాజకీయాల గురించి ఆలోచిస్తున్నది ప్రధాని అయిపోదామని కాదు.. దేశాన్ని సరికొత్త మార్గంలో నడిపించేందుకు, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలూ, కేసీయార్ జాతీయ పార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ ప్రాంతీయ పార్టీని స్థాపించడం ఎంత కష్టమో కేసీయార్‌కి తెలుసు.
తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ముఖ్యమంత్రి అవడానికి కేసీయార్‌కి చాలాకాలమే పట్టింది. అప్పట్లో కేసీయార్ జోష్ వేరు, ఇప్పుుడు కేసీయార్ పరిస్థితి వేరు. ఓ పదేళ్ళు దేశంలో అధికారం కోసం కేసీయార్ ఎదురుచూసే అవకాశం లేదన్నది నిర్వివాదాంశం. అన్నటికీ మించి, జాతీయ పార్టీని స్థాపించి.. రెండేళ్ళలో దాన్ని దేశవ్యాప్తంగా పాపులర్ చేయాలంటే అదంత తేలికైన వ్యవహారం కాదు. వచ్చే ఏడాదితో తెలంగాణలో రెండో దఫా కేసీయార్ పాలన ముగుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అధికార పీఠమెక్కితే సరే సరి. లేదంటే, వ్యవహారం తేడా కొట్టేస్తుంది. ఒకవేళ తెలంగాణలో కేసీయార్ ఇంకోసారి ముందస్తు వ్యూహం రచిస్తే మాత్రం, కేసీయార్ దగ్గర కొంత సమయం వుంటుంది
జాతీయ రాజకీయాల కోసం. కానీ, అదంత తేలికైన వ్యవహారం కాదు. మజ్లిస్ పార్టీ ఎలాగూ వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల్లో పోటీ చేసిన దరిమిలా, అది తమకు ఉపయోగపడుతుందని కేసీయార్ బలంగా నమ్మితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. మజ్లిస్ పార్టీ ఎవరితోనైనా రాజకీయంగా కలిసిపోతుంది.. ఎవరు అధికారంలో వుంటే, వారితో అంటకాగడం మజ్లిస్ పార్టీకి అలవాటే.
ఖచ్చితమైన వ్యూహాల్లేకుండా, సరైన సమయం లేకుండా కేసీయార్ దేశ రాజకీయాల్లోకి వెళితే మాత్రం, ఇన్నాళ్ళూ కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు బూడిదలో పోసిన పన్నీరవుతాయి.