BJP : ఛాన్సే లేదు.! టీడీపీతో బీజేపీ కలిసేదే లేదు.! అంతేనా.?
BJP : బీజేపీ, టీడీపీ కలిసిపోతున్నాయహో.. అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంబరాలు చేసుకుంటోంది. ‘చిన్నబాబు’ నారా లోకేష్ మీద అమితమైన అభిమానంతో, బీజేపీ – టీడీపీ పొత్తుల గురించి కథనాలు రాస్తూ, ఆ పొత్తుకి కారణం ఆయనేనంటూ ఎలివేషన్లు ఇస్తూ వస్తోంది. బీజేపీ – టీడీపీ కలిసి పని చేయబోతున్నాయని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబుదే అధికారమనీ టీడీపీకి మద్దతిస్తోన్న చాలా మీడియా సంస్థల్లో ప్రచారం జరుగుతోంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలేంటి.? ఏ రాజకీయ పార్టీకి ఎంత బలం వుంది.?
అన్నదానిపై కనీసపాటి విశ్లేషణ కూడా చిత్తశుద్ధితో చేయలేని స్థాయికి సోకాల్డ్ తెలుగు మీడియా తన దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తోన్న వైనం జనానికి అర్థమవుతోంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో గెలిచిన వైసీపీ, వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లూ కొల్లగొట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని ఎలా కాపాడుకోవాలి.? అన్నదానిపై మల్లగుల్లాలు పడటం సహజమే. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టు.. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసినా పెద్దగా ఆ పార్టీలకు కలిసొచ్చేదేమీ వుండదు. ఎందుకంటే, ఆ మూడు రాజకీయ పార్టీలకీ రాష్ట్రంలో పెద్దగా స్టేక్ వున్నట్లు కనిపించడంలేదు.జన బాహుళ్యంలో ఇదే చర్చ జరుగుతోంది.
ఇదిలా వుంటే, వైసీపీలో కొందరు కీలక నేతల్ని లాగేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. టీడీపీ సైతం ఈ విషయంలో ఒకింత జోరుగానే కనిపిస్తోంది. జనసేన సంగతి సరే సరి. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్న రాజకీయాన్ని ఏపీలో ప్రయోగిస్తే మాత్రం ఈక్వేషన్ కొంత భిన్నంగా మారే అవకాశాలు లేకపోలేదు. బీజేపీని ఆ కోణంలోనే టీడీపీ దువ్వుతోందన్నది వైసీపీ అనుమనంగా కనిపిస్తోంది. అందుకే, ఎప్పటికప్పుడు పార్టీ నేతల్ని అప్రమత్తం చేస్తోన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ సహా బీజేపీ, జనసేనలకు అవకాశమే ఇవ్వకూడదని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. కాదు కాదు, హెచ్చరిస్తున్నారు. కాగా, టీడీపీ వైపు తాము వెళ్ళబోవడంలేదని బీజేపీ స్పష్టం చేస్తోంది. టీడీపీతో తామసలు మంతనాలే జరపలేదన్నది బీజేపీ వాదనగా కనిపిస్తోంది.