KTR : ముందస్తు ఊహాగానాలకు తెరదించిన కేటీయార్.! భయమే కారణమా.?
KTR : తెలంగాణ రాష్ట్ర సమితి ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోవడంలేదట. అదేంటీ, మొన్నే కదా ముఖ్యమంత్రి కేసీయార్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముందస్తు ఎన్నికల విషయమై ‘డేట్’ చెప్పాలంటూ సవాల్ విసిరింది.. ఇప్పుడిలా కేటీయార్ ఎందుకు రివర్స్ గేర్ వేశారు.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. బహుశా తెలంగాణ రాష్ట్ర సమితి ముందస్తు ఎన్నికలంటే భయపడినట్లుంది.. అన్నది కేటీయార్ ప్రకటనతో తెలంగాణలో జరుగుతున్న చర్చ. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని చెప్పిన కల్వకుంట్ల తారకరామారావు, షెడ్యూల్ ప్రకారమే 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కుండబద్దలుగొట్టేశారు.
తెలంగాణ రాష్ట్రం అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో దూసుకుపోతోందనీ, ప్రజలు తమకు ఐదేళ్ళ పాలనకు అవకాశమిచ్చారనీ, తొందరపడి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోమనీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీయార్ చెప్పారు. మరి గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి చేసిందేంటి.? ఐదేళ్ళ పాలన పూర్తి చేసుకోకుండానే గతంలో కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. బంపర్ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వచ్చారు. అదే వ్యూహంతో ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన కేసీయార్ చేసినా, మారిన సమీకరణాల నేపథ్యంలో ఆయన తన ఆలోచన మార్చుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

No Early Polls In Telangana, KTR Clears The Air
తెలంగాణలో బీజేపీ బలపడుతున్న దరిమిలా, రిస్కీ అటెంప్ట్ చేయడం ఇష్టం లేక కేసీయార్, ముందస్తుపై రివర్స్ గేర్ వేశారన్నది బీజేపీ ఆరోపణ. బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సమితి.. రెండూ ఒక్కటేననీ, రెండు పార్టీలూ కలిసి ముందస్తు డ్రామా ఆడాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎవరి గోల వారిదే.! కాగా, కేటీయార్ ఖండించినా 2023 మార్చిలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగొచ్చన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. ఇంకాస్త తొందరపడి ఈ ఏడాది చివర్లోనే కేసీయార్ ఎన్నికలకు వెళ్ళేందుకు వీలుగా ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చన్న వాదనలూ లేకపోలేదు.