Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి రాజకీయాలపై ఆసక్తి వుందా.? లేదా.?
Jr NTR : ఏదో యధాలాపంగా రాజకీయాల్లోకి వచ్చేసి, తెలుగుదేశం పార్టీ తరఫున 2009 ఎన్నికల సమయంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎన్నికల ప్రచారం చేసేశారని అనుకోగలమా.? చాలా చిన్న వయసులోనే, చాలా పెద్ద రాజకీయ వ్యూహాలు ఆయన రచించినట్లుగా అప్పట్లో ఆయన రాజకీయ ప్రసంగాలు వుండేవి. సరే, ఆ వయసులో అంతటి రాజకీయ పరిపక్వత ఆయనలో వుందా.? ఎవరి స్క్రిప్ట్ సహాయం లేకుండా ఎన్టీయార్ అలా ప్రసంగాలు అదరగొట్టేశారా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ. మంచి వాగ్ధాటి వుంది జూనియర్ నందమూరి తారకరామారావుకి. ఏ విషయమ్మీద అయినా, చకచకా మాట్లాడేయగలుగుతాడు.. ఆ విషయాలపై పూర్తి అవగాహన వున్నట్లుగా జూనియర్ తారకరాముడు.
అందుకే, అప్పట్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని తెలుగుదేశం పార్టీ కోసం వాడేశారు, అవసరం తీరాక బయటకు గెంటేశారు కూడా.! ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీయార్ మీదకు రాజకీయ వల షురూ అయ్యింది. అయితే, ఈసారి ఆ వల విసింది భారతీయ జనతా పార్టీ. జూనియర్ ఎన్టీయార్‌కి రాజమౌళి కుటుంబంతో వున్న సన్నిహిత సంబంధాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ రాజమౌళి కుటుంబంలోని పెద్దాయన విజయేంద్ర ప్రసాద్, బీజేపీ దయతో రాజ్యసభ సీటు దక్కించుకున్నారు.. అందుకు ప్రతిఫలంగా, జూనియర్ ఎన్టీయార్ బీజేపీ వైపుకు వెళ్ళే అవకాశమూ కనిపిస్తోంది.
‘పార్టీని జూనియర్ ఎన్టీయార్‌కి అప్పగించెయ్యాలి..’ అనే నినాదాలతో యంగ్ టైగర్ అభిమానులు ‘జై ఎన్టీయార్’ ప్లకార్డులు చూపించి మరీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఓ వైపు ఇబ్బంది పెడుతున్నారు. ఇంకో వైపు బీజేపీతో జూనియర్ ఎన్టీయార్ మంతనాలు షురూ చేశాడు. సో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా – జూనియర్ ఎన్టీయార్ భేటీని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. తెరవెనుకాల ఖచ్చితంగా రాజకీయం నడుస్తోంది. జూనియర్ ఎన్టీయార్ కూడా రాజకీయాలపై ఆసక్తితోనే వున్నాడు. రైట్ టైమ్‌లో కుంభస్థలం మీద కొట్టాలనే కసితో వున్నట్టున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్.