Sagar by poll : టీఆర్ఎస్ ను గెలిపించిన సాగర్ ప్రజలు.. మెజార్టీ ఎంత అంటే..?
Sagar by poll : తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి నాగార్జున సాగర్ ఉపఎన్నిక గురించే చర్చ. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ నేత జానారెడ్డి కంచుకోటను టీఆర్ఎస్ పార్టీ మరోసారి బద్దలు కొట్టింది. 2018 ఎన్నికల్లోనూ జానారెడ్డిని ఓడించి నోముల నర్సింహయ్య విజయబావుట ఎగురవేసిన విషయం తెలిసిందే. తాజాగా సాగర్ ఉపఎన్నిక్లలోనూ ఆయన కొడుకు నోముల భగత్ గెలుపొందారు. సాగర్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీనే గెలిపించారు.
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్… 15487 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో ఉండగా… బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 21 రౌండ్లు ముగిసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి 74,726 ఓట్లు పోలవగా…. కాంగ్రెస్ పార్టీకి 59,239 ఓట్లు పోలయ్యాయి. ఇక.. బీజేపీకి కేవలం 6365 ఓట్లు మాత్రమే పోలవడం గమనార్హం.
Sagar by poll : కూలిపోయిన జానారెడ్డి కంచుకోట
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి ఈసారి సాగర్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెగ ప్రయత్నించారు. కానీ.. సాగర్ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపారు. ఈసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి.. అన్నీ తానై చూసుకున్నా… సాగర్ లో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగించినా… సాగర్ ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టాలను తెలుసుకున్నా… అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం గుప్పించినా.. సాగర్ ప్రజలు జానారెడ్డిని రెండోసారి ఓడించారు. అయితే… టీఆర్ఎస్ పార్టీకి సానుభూతితో పాటు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా వర్కవుట్ అయ్యాయి. సాగర్ లో టీఆర్ఎస్ పార్టీ గెలవడంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.