Buggana Rajendranath : సూపర్ సిక్స్ కాదు సూపర్ జీరో.. బుగ్గన రాజేంద్రనాథ్
Buggana Rajendranath : ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన బుగ్గన.. ‘తల్లికి వందనం’ కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎవరు తనను ప్రశ్నించినా చంద్రబాబు సహించరని, ప్రజలే ప్రశ్నించినా ఆయన ఉగ్రంగా స్పందిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్న చంద్రబాబు, ప్రజల ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ మోసగిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలపై ప్రశ్నలు సంధించిన బుగ్గన, ఉచిత బస్సు ప్రయాణంపై తారీఖులు మారుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామన్నారు కానీ ఒకటి ఇచ్చి ఆ తర్వాత ఎగనామం పెట్టారని ఆరోపించారు. తల్లికి వందనం పథకం పేరుతో ప్రకటించినప్పటికీ, చాలా మందిని అర్హులుగా గుర్తించకుండా మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పీపీపీ విధానాన్ని అనుసరించడం ద్వారా ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోతోందని బుగ్గన వ్యాఖ్యానించారు. ఆర్థికంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉందని బుగ్గన తెలిపారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు మళ్లీ కాల్ మనీ వడ్డీ వ్యాపారానికి పాల్పడుతున్నాయన్నారు.

Buggana Rajendranath : సూపర్ సిక్స్ కాదు సూపర్ జీరో.. బుగ్గన రాజేంద్రనాథ్
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండును చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. 2014లో 19,130 కోట్లుగా ఉన్న ఈ లయబిలిటీలు చంద్రబాబు హయాంలో 76,516 కోట్లకు పెరిగాయని, తాము అధికారంలో ఉన్నప్పుడు 76,038 కోట్లకు తగ్గించి 478 కోట్లను తిరిగి ఉద్యోగులకు చెల్లించామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అలగనూరు రిజర్వాయర్‌లో పడిపోయినట్టు అయిపోయిందని, దీని నుంచి గట్టెక్కాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక KKసర్వే టీడీపీ అనుకూలంగా వచ్చినప్పుడు జయజయహే అన్నారు..ఇప్పుడే అదే సర్వేలో ప్రతికూలంగా వచ్చినప్పుడు మాత్రం విమర్శలు చేస్తూ తమ స్వార్థాన్ని బయటపెడుతున్నారని బుగ్గన విమర్శించారు. ప్రజల్లో నిజంగా ఏముంది, వారి మద్దతు ఎటు వెళుతోంది అనే విషయంలో పార్టీలు నిజాయితీగా ఆత్మవిశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.