Pawan Kalyan : టీడీపీ, బీజేపీల్ని వదిలించుకోకపోతే పవన్ కళ్యాణ్‌కే నష్టం.!
Pawan Kalyan : రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ అంటే ‘టూ’ అవ్వాలనే రూల్ ఏమీ వుండదు. ఒక్కోసారి కొన్ని కలయికలు మైనస్ అవుతుంటాయి కూడా. జనసేన పార్టీ విషయంలో అదే జరుగుతోంది. జనసేన ఆవిర్భావం నుంచీ, ‘సింగిల్‌గా వస్తాం..’ అనే మాట ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి వినిపించడంలేదు. వాస్తవానికి, 2014 ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి చాలా చాలా అనువైనవి. కానీ, ఆయన ఆ అనుకూల సమయాన్ని వృధా చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ, కేవలం బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి ఊరుకుంది తప్ప, పోటీ చేయలేదు.
ఒకవేళ ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేసి వుంటే, ఈ రోజు జనసేన పార్టీ స్థాయి ఇంకోలా వుండేది. పవన్ కళ్యాణ్ ఏ లోక్‌సభ నియోజకవర్గం నుంచో పోటీ చేసి, కేంద్ర మంత్రి అయి వుంటే.. జనసేన పార్టీ రాజకీయంగా ఎదిగేందుకు అదెంతో ఉపయోగపడేది. కానీ, అప్పట్లో జనసేన పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు టీడీపీ అధినేత చంద్రబాబు, ‘తీపి మాటలు’ చెబుతూ. బీజేపీ సైతం ఈ విషయంలో జనసేనను మోసం చేసిందన్నది నిర్వివాదాంశం. అయితే, ఇక్కడ తప్పు బీజేపీ, టీడీపీలది మాత్రమే కాదు, జనసేన అధినేత స్వయంకృతాపరాధం వల్ల కూడా జనసేన దెబ్బ తినేసింది. మరి, డ్యామేజ్ కంట్రోల్ కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశారు.?
ఇప్పటివరకూ ఏమీ చేయలేదు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ పార్టీతో పొత్తుపెట్టుకోవడం జనసేన అధినేత చేసిన మరో చారిత్రక తప్పిదం. అందుకే, ఈ రోజు జనసేనాని ఎదుగూ బొదుగూ లేకుండా పోయారు రాజకీయంగా. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పలేకపోతున్నారుగానీ, ‘మాకు అవకాశం ఇచ్చి చూడండి.. నేను చెప్పేది విని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నంచండి..’ అంటూ తాజాగా సరికొత్తగా జనసేన అధినేత చేస్తున్న వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఏదిఏమైనా, టీడీపీని వదిలించేసుకున్నామని చెబుతున్న పవన్, బీజేపీని సైతం వదిలించుకోవాల్సిందే. లేదూ, ఆ రెండు పార్టీలకూ దగ్గరవ్వాలనుకుంటే, ఇంకో పాతికేళ్ళయినా జనసేన పార్టీకి ఎదుగూబొదుగూ వుండదు.