Ys Jagan : ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ఆంధ్రప్రదేశ్‌లో నిషేధం.! వైఎస్ జగన్‌కి ఎన్ని మార్కులు.?
Ys Jagan : గాలి కలుషితం, నీరు కలుషితం.. అసలు కాలుష్యం కాకుండా వున్నదేంటి.? ఏమీ లేదు. పర్యావరణాన్ని ఈ స్థాయిలో కలుషితం చేసినవేంటి.? అని లెక్కలు తీస్తే, అందులో కర్బన ఉద్గారాలది మొదటి స్థానమైతే, రెండో స్థానం ప్లాస్టిక్‌ది. కర్బన ఉద్యగారాల కంటే కూడా ప్లాస్టిక్ పర్యావరణానికి ఎక్కువ చేటు చేస్తోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ మీద పలు రకాల నిషేధాలు అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విశాఖపట్నం పర్యటన సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ బ్యాన్ విషయమై రాజకీయ వర్గాల్లో చిత్ర విచిత్రమైన రీతిలో రచ్చ జరుగుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజు కట్టబోయే ఫ్లెక్సీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలా కుట్ర పన్నారన్నది జనసేన శ్రేణుల ఆరోపణ. ఎంత సిల్లీగా వుందో కదా ఈ వాదన.? ఇదొక్కటే కాదు, ఫ్లెక్సీల వ్యాపారంపై ఆధారపడి జీవనం పొందుతోన్న వేలాది కుటుంబాలు రోడ్డున పడిపోతాయన్న వాదన కూడా తెరపైకొస్తోంది. వారికి ప్రత్యామ్నాయం చూపడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా.? ప్లాస్టిక్ ఫ్లెక్సీల వల్ల చాలా రాజకీయ వివాదాలు తెరపైకొస్తున్నాయి. కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాలకూ ఈ ఫ్లెక్సీలే కారణమవుతున్నాయి.
ఎలా చూసినా, ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధించడం సముచితమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ప్రతీదీ రాజకీయ కోణంలో చూసే రాజకీయ పార్టీలు, నాయకులకు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మింగుడు పడకపోవచ్చు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ వల్ల విపక్షాలే కాదు, అధికార వైసీపీ కూడా ‘ప్రచారం’ పరంగా ఇబ్బంది పడుతుంది. ఆ విషయం తెలిసీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ప్రజోపయోగ నిర్ణయాల పట్ల విపక్షాలు సైతం ప్రభుత్వానికి అండగా వుండాల్సిన అవసరం వుంది. కానీ, దురదృష్టం ఏపీలో అలాంటి సానుకూలత ఎప్పటికీ కనిపించదు.