Politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం.. వార్ వన్ సైడ్ కానే కాదట.!
Politics : 2019 తరహాలో 2024 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందనీ, ఈసారి తమదే అధికారం అని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అంటోంది. అయితే, 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న తాము, ఈసారి 175 సీట్లు కొల్లగొట్టి తీరతామని వైసీపీ చెబుతోంది. 2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాన్ని చవిచూసిన జనసేన కూడా ఈసారి రేసులో తామూ వున్నామని అంటోంది. రకరకాల సర్వేల ఫలితాలు అడపా దడపా తెరపైకొస్తున్నాయి. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. తమకు అనుకూల ఫలితాలు సర్వేల్లో కనిపిస్తోంటే, అవే నిజమని ఆయా రాజకీయ పార్టీలు అనడం చూస్తున్నాం. ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులు ఎలా వున్నాయి.? గ్రౌండ్ రియాల్టీ ఏంటి.?
ఐదేళ్ళ పాలన తర్వాత ఏ పార్టీ అయినా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇంపాక్ట్ గట్టిగానే చూపిస్తుంది. దాన్ని తప్పించుకోవడం అంత తేలిక కాదు. 2004 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ, 2009 నాటికి కాస్త జోరు తగ్గింది. 2009లో గెలిచినప్పటికీ, ‘ప్రజలు మనల్ని పూర్తిగా ఆశీర్వదించలేదు.. హెచ్చరించారు..’ అంటూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. తమ వైఫల్యాల్ని అంగీకరించడం అంటే అలా వుండాలి. చంద్రబాబు ఏనాడూ తమ వైఫల్యాల్ని అంగీకరించిన దాఖలాల్లేవు. ప్రజలే తప్పు చేశారని చంద్రబాబు అంటుంటారు. అందుకే, చంద్రబాబుని నమ్మాలంటే జనాలకి ఒకింత అనుమానం.
అయితే, ఇక్కడ ఈసారి జనసేన పార్టీ ఒకింత బలంగా కనిపిస్తోంది. టీడీపీ – జనసేన కలిస్తే వైసీపీకి కొంత లాభమే. ఎందుకంటే, ఇద్దర్నీ కలిపేసి ఏకరువు పెట్టేయొచ్చు. అలాక్కాకుండా జనసేన – టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే, కొంత లాభం, కొంత నష్టం వుంటుంది వైసీపీకి. ఏం జరిగినా, వైసీపీకి అధికారమైతే దూరమయ్యే అవకాశం లేదు. కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్ గురించి ముందే అంచనా వేయడం అంత మంచిది కాదు. వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాల్లేవనీ, వైసీపీ గెలిచినా, బొటాబొటి విజయమే అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే, ఘనమైన గెలుపు కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ ప్రజా ప్రతినిథుల్ని జనంలో వుండమని ఆదేశించారు.