Revanth Reddy : రేవంత్ రెడ్డి వైపు చూస్తున్న కోదండరాం సారు.. వీరు కలిస్తే ఏం జరుగుతుంది?
Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు క్షీణిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి తామే సరైన ప్రత్యర్థులం అన్నట్లుగా బీజేపీ పార్టీ నాయకులు దూసుకు పోతున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి వంటి నాయకులు ఏమైనా చేయాలని భావించినా కూడా ఆయన్ను పార్టీలోని కొందరు సీనియర్ లు ముందుకు సాగనివ్వడం లేదు. పార్టీలో బచ్చా అయిన రేవంత్ రెడ్డికి ఎందుకు అధికారం ఇవ్వాలి, అతడికి ఎందుకు క్రెడిట్ పోనివ్వాలని కొందరు సీనియర్ నాయకులు ఇప్పుడు అడ్డు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉండాలని లేదంటూ వార్తలు వస్తున్నాయి.
రేవంత్ రెడ్డి మంచి ఫాలోయింగ్ ఉన్న నేత. కేసీఆర్ వంటి నాయకులను ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డికి తెలంగాణలో మంచి క్రేజ్ ఉంది. ఆయన సరైన పార్టీలో ఉంటే లేదంటే సొంత పార్టీ పెడితే ఖచ్చితంగా ఆయన కీలక రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో జాయిన్ అవ్వలేడు… బీజేపీలోకి వెళ్తే ప్రాముఖ్యత దక్కడం అనుమానమే. కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలోనే తప్పక కొనసాగుతున్నాడు. ఇలాంటి సమయంలో కోదండరాం సారు రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
Revanth Reddy : కోదండరాం పార్టీలోకి రేవంత్ వస్తే..
కోదండరాం తెలంగాణ జన సమితి పార్టీ ఏర్పాటు చేసి చాలా కాలం అయినా కూడా కనీసం ఆ పార్టీ పేరు గుర్తు కూడా జనాల్లోకి వెళ్లలేదు. అలాంటి పార్టీలోకి రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు కోదండరాం ఏర్పాట్లు చేస్తున్నాడు. పార్టీని పూర్తిగా రేవంత్ రెడ్డికి అప్పగించేందుకు కూడా కోదండరాం సారు సిద్దంగా ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. పార్టీ కోసం పని చేస్తూ రేవంత్ రెడ్డి తో నడిచేందుకు సిద్దంగా ఉన్నట్లుగా కోదండరాం సన్నిహితుల వద్ద అంటున్నాడు. కాని రేవంత్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకుంటే పర్వాలేదు కాని మళ్లీ కోదండరాం పార్టీలోకి వెళ్తే ప్రజలు ఏం అనుకుంటారు.. అసలు వీరిద్దరు కలిస్తే ప్రయోజనం ఏమైనా ఉందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.