Revanth Reddy : రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు.. టీపీసీసీ చీఫ్ లాంఛనమే?
Revanth Reddy, రేవంత్ రెడ్డి , నాగార్జునసాగర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అక్కడ 2018 లో మిస్సయిపోయింది కానీ.. లేకపోతే కాంగ్రెస్ పార్టీయే అక్కడ ఎప్పుడూ అధికారంలో ఉండేది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉపఎన్నిక రావడంతో.. మళ్లీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆశలు పుట్టుకొచ్చాయి. ఎలాగైనా అక్కడ గెలవాలన్న కసితో ఉంది. అక్కడ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఉపయోగం. లేదంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రావాలంటే మాత్రం చాలా కష్టం.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం.. ఒక గొప్ప అధినాయకుడు కావాలి. అందుకోసమే.. కాంగ్రెస్ హైకమాండ్ కూడా తీవ్రంగా కసరత్తు చేస్తోంది. టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. తదుపరి టీపీసీసీ చీఫ్ ఎవరు అవుతారా? అని అంతా ఎదురు చూస్తున్నారు.
అయితే.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు.. హైకమాండ్ కూడా భావిస్తోంది. చీఫ్ గా చాలామంది నేతల పేర్లు హడావుడి చేసినప్పటికీ.. ఫైనల్ గా రేవంత్ రెడ్డినే సోనియా గాంధీ ఖాయం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు వచ్చింది.
రేవంత్ రెడ్డితో పాటు జానారెడ్డి కూడా ఢిల్లీకి?
త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నికలు రానున్నందున.. ఎంపీ రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందట. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై హైకమాండ్ రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరికి పిలుపు వచ్చిందట. అంటే.. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డిని కన్ఫమ్ చేసినట్టే. మరోవైపు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఓకే చేశారు కాబట్టే.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక బాధ్యతను అప్పగిస్తున్నారు.. అంటూ ప్రచారం సాగుతోంది. చూద్దాం మరి.. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని సాగర్ ఉపఎన్నికలో అయినా కాంగ్రెస్ విజయదుందుబి మోగిస్తుందో లేదో?