Revanth Reddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భేషరతు క్షమాపణ చెప్పిన రేవంత్ రెడ్డి.!
Revanth Reddy ; మునుగోడు ఉప ఎన్నిక విషయమై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నానా తంటాలూ పడుతున్నారు. రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన స్టయిల్లో ప్రయత్నిస్తూనే వున్నారు.సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, మునుగోడు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన దరిమిలా, ఆ మునుగోడు ఉప ఎన్నిక బాధ్యత తన మీద ఎక్కడ పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ అసహనం నుంచి బయటపడేందుకు, రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేయాలన్నది వెంకటరెడ్డి వ్యూహం. అయితే, రాజగోపాల్ రెడ్డి చేసిన తప్పు నేపథ్యంలో వెంకటరెడ్డిని ఇరికించేసి, తాను ఎస్కేప్ అవ్వాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది.
మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే, ఆ గెలుపు రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుంది. ఓడితే, బాధ్యత వహించాల్సింది ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా ఇంట్రెస్టింగ్ ‘వార్’ నడుస్తోంది.అయితే, మునుగోడులో ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, వెంకటరెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. దాన్ని అడ్డం పెట్టుకుని, మునుగోడు ఉప ఎన్నికకు దూరంగా వుండాలని వెంకటరెడ్డి భావిస్తున్నారు. కానీ, ఆయన్ని అడ్డంగా బుక్ చేసే క్రమంలో, వెంకటరెడ్డికి క్షమాపణ కూడా చెప్పేశారు రేవంత్ రెడ్డి. అద్దంకి తయాకర్‌ని పార్టీ నుంచి బయటకు పంపే దిశగా కూడా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారట. ఇటు వెంకటరెడ్డి అటు రేవంత్ రెడ్డి..
ఈ ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరు నడపడం కాదు, ఆ తెలివితేటలేవో పార్టీ బాగు కోసం ఉపయోగించి వుంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడేదే కదా.? ‘నేను మోస్ట్ సీనియర్..’ అని చెప్పుకుంటున్న వెంకటరెడ్డి కావొచ్చు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావొచ్చు.. ఇద్దరూ కలిసి మునుగోడు వేదికగా కాంగ్రెస్ పార్టీని ఓ ప్రయోగశాలగా మార్చేసి, పార్టీని భ్రష్టుపట్టించేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. ఇందులో నిజం లేకపోలేదు కూడా.! ఈ మొత్తం ఆటలో లాభపడుతున్నది భారతీయ జనతా పార్టీ. అందుకే, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన గెలుపుపై బోల్డంత ధీమాగా వున్నారు. అంతర్గత కుమ్ములాటలున్నా, మునుగోడులో టీఆర్ఎస్ కూడా కాస్తో కూస్తో లాభపడే అవకాశాల్లేకపోలేదు, కాంగ్రెస్ రాజకీయాల కారణంగా.