ORR | ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
ORR | హైదరాబాద్ సమీపంలోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలిని ఇన్ఫోసిస్ ఉద్యోగి సౌమ్యా రెడ్డిగా గుర్తించారు. ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న సుమారు ఎనిమిది మంది ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌పై బోల్తా పడింది.

#image_title
ఘోర ప్రమాదం..
ప్రమాదాన్ని గుర్తించిన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ఉద్యోగుల్లో కొందరికి తీవ్రమైన గాయాలయ్యాయని సమాచారం.
ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. వాహనదారులంతా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని, అతివేగం ప్రాణాల మీదకు తెస్తుంది అని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సౌమ్యా రెడ్డి మృతి వార్తతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే సమయంలో, గాయపడిన సహోద్యోగులు త్వరగా కోలుకోవాలని పలువురు ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. ఈ ఘటన ఐటీ వర్గాల్లో విషాదాన్ని మిగిల్చింది.