YS Sharmila : హుజూరాబాద్ ఎన్నికలను అడ్డం పెట్టుకొని.. కేసీఆర్ కు భారీ షాక్ ఇవ్వబోతున్న షర్మిల?
కేసీఆర్ కు వైఎస్ షర్మిల షాక్
YS Sharmila : తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ఫోకస్ అంతా హుజూరాబాద్ నియోజకవర్గం మీదే ఉంది. అక్కడ బీజేపీ తరపున బరిలోకి దిగబోతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున ఎవరు బరిలోకి దిగుతారనే అంశం ఇంకా తేలలేదు. దీనిపై ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక తెలంగాణలో రాజకీయ శక్తిగా మారాలని భావిస్తున్న వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్‌టీపీ హుజూరాబాద్‌లో పోటీకి దూరమని ప్రకటించింది.
అయితే తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఊహించని విధంగా షాక్ ఇవ్వాలని వైఎస్ షర్మిల అండ్ కో నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయాలని కొంతకాలంగా దీక్షలు, నిరసనలు చేస్తున్న వైఎస్ షర్మిల.. హుజూరాబాద్‌లో నిరుద్యోగులు పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయితే తాజాగా ఇదే అంశాన్ని వైఎస్ఆర్‌టీపీ సీరియస్‌గా తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న వైఎస్ఆర్‌టీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికను వినియోగించుకోవాలని భావిస్తోంది.
వెయ్యి మందితో ..
ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో వెయ్యి మందికి పైగా నిరుద్యోగులతో నామినేషన్లు వేయించాలని ఆ పార్టీ నిర్ణయించింది. నిరుద్యోగులతో దగ్గరుండి హుజూరాబాద్‌లో నామినేషన్లు వేయించాలని వైఎస్ఆర్‌టీపీ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికార పార్టీపై కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమైతే సరిపోదని.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది.
ఈ క్రమంలోనే నిరుద్యోగులతో హుజూరాబాద్‌లో నామినేషన్లు వేయిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకుంటుందని వైఎస్ఆర్‌టీపీ యోచిస్తున్నట్టు సమాచారం. ఇలా చేయడం వల్ల ప్రజలు, నిరుద్యోగుల్లోనూ పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమవుతుందని వైఎస్ షర్మిల అనుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. విపక్షాలు కూడా నిరుద్యోగులతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేసే ఈ చర్యలను తప్పుబట్టలేవని ఆ పార్టీ భావిస్తోంది.
YS Sharmila : వైఎస్సార్టీపీకి .. షాక్
ఇదిలా ఉంటే, వైఎస్సార్టీపీలో .. లుకలుకలు బయటపడ్డాయి.. పార్టీలో కొత్తగా చేరికలు లేకపోగా.. ఉన్న కొందరు నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. ఆ మధ్య పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పగా.. తాజాగా ఇందిరా శోభన్ షర్మిలకు హ్యాండ్ ఇచ్చారు. దీంతో అసలు షర్మిల పార్టీ తెలంగాణలో నిలదొక్కుకుంటుందా ? అనే చర్చ జరుగుతోంది.
అసలు షర్మిల కొత్త పార్టీ ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఎంతమేరకు ఉంటుందన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.. వైఎస్ షర్మిల చరిష్మా ఏ మేరకు ఓట్లు రాల్చుతుందనే విషయంలో క్లారిటీ రాకపోతే.. నేతలెవరూ ఆమె పార్టీ వైపు చూసే అవకాశం ఉండకపోవచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాననే నినాదంతో ముందుకొచ్చిన వైఎస్ షర్మిలకు నేతల రాజీనామాలు గట్టిదెబ్బగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో పోటీ చేయకపోయినా.. అధికార టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలనుకుంటున్న వైఎస్ షర్మిల వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.