Solar Car : సోలార్ కారును రూపొందించిన లెక్కల మాస్టార్.. పట్టుదలతో కష్టపడి అద్బుతం
Solar Car : ప్రపంచ వ్వాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులు విలవిలలాడుతున్నారు. పెరుగుతున్న వాహనాలతో ఇంధన ధరలు రోజురోజుకీ మండిపోతున్నాయి. ఇక ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కశ్మీర్ కి చెందిన ఓ లెక్కల మాష్టారు సోలార్ కార్ తయారు చేసి అద్బుతం సృష్టించాడు. లెక్కల మాస్టర్ కారు తయారు చేయడమేంటని అనుకుంటున్నారా.. ఏ రంగంలో ఉన్నా సరే ఆలోచన, పట్టుదల, అవగాహన ఉంటే ఏదైనా సాధించగలుగుతారు. అసలు ఆయనకు ఆ ఆలోచన ఎలా వచ్చింది.. ఎందుకు తయారు చేయాలనుకున్నాడు..
ఏ విధంగా తయారు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే కశ్మీర్ కి చెందిన బిలాల్ అహ్మద్ అనే గణిత ఉపాధ్యాయుడు పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో నడిచే కారును తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కశ్మీర్ రాజధాని అయినటువంటి శ్రీనగర్ లో సనత్ నగర్ నివసించే ఈయన చాలా సంవత్సరాలుగా వివిధ రకాల కార్ లను క్రియేట్ చేసే విధానంపై రిసెర్చ్ చేశారు. ఈ సోలార్ కారు తయారు చేయడానికి సుమారుగా 11 సంవత్సరాలుగా పట్టుదలతో కృషి చేసి చివరికి ఆటోమేటిక్ సోలార్ కార్ ను రూపొందించారు. ఈ కారు పూర్తిగా సోలార్ పవర్ తోనే నడుస్తుంది .అంతేకాదు ఈ సోలార్ మోనో క్రిస్టలైన్ సోలార్ ప్యానల్స్ తో తయారు చేయబడినట్లు ఆయన వివరించారు.
Solar Car : పదకొండు సంవత్సరాలు కష్టపడి..
అయితే ఈ కారు తక్కువ ఎండలో కూడా ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుందని తెలిపాడు. 2009లోనే సౌరశక్తితో నడిచే కారును తయారు చేయాలని భావించిన బిలాల్ కొన్ని అవాంతరాల కారణంగా 11 సంవత్సరాలపాటు ప్రయత్నించి చివరికి విజయం సాధించారు. సాధారణంగా వర్షాకాలంలో అయితే సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన కొన్ని రకాల సోలార్ కార్లు కేవలం ఎండ ఎక్కువగా ఉంటే మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. కానీ ఈ కారు వర్షాకాలంలో చాలా తక్కువ ఎండ ఉన్నా సరే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసి పైసా ఖర్చు లేకుండా వేగంగా దూసుకుపోనుంది. అయితే ఈ కారును రెడీ చేయడానికి ఎంతో కష్టపడిని బిలాల్ ను అందరూ అభినందిస్తూ సోలార్ కార్ కి ఫిదా అవుతున్నారు.