Karimnagar.. ఎస్పీ పెద్ద మనసు.. దివ్యాంగ క్రీడాకారుడికి సాయం
పోలీసులు అంటే చాలా కఠిన హృదయులు అని చాలా మంది అంటుంటారు. అయితే, అందరూ అలా ఉండబోరని నిరూపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ. జిల్లాలోని రుద్రంగి మండలానికి చెందిన సింగారపుబాబు దివ్యాంగుడు అయినప్పటికీ మంచి క్రీడాకారుడు. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమున్న ఇతను ప్రతీ రోజు ప్రాక్టీస్ కు వెళ్తుంటాడు. కాగా ఇటీవల సింగారపు బాబు ఇరాన్‌లో జరిగే దివ్యాంగుల ఆసియా కప్ సిట్టింగ్ వాలీబాల్ ఆటకు ఎంపికయ్యాడు. నవంబర్ 6 నుంచి 14 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి.
అయితే, ఇందులో పాల్గొనేందుకుగాను ఎంట్రీ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అది కట్టడానికి ఆర్థికంగా స్థోమత లేక సింగారపు బాబు ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన ఎస్పీ శనివారం అతడిని కలిశాడు. పోలీసు శాఖ తరఫున రూ.50 వేలు సాయం చేశాడు. దాంతో దివ్యాంగ క్రీడాకారులు సింగారపుబాబు ఆనందం వ్యక్తం చేశాడు. సిట్టింగ్ వాలీబాల్ గేమ్‌లో విజేతగా నిలిచి పోలీసుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పాడు. ఇకపోతే పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొన్న క్రీడాకారులు సత్తా చాటిన సంగతి అందరికీ విదితమే. భారత్‌కు పలు పతకాలు సాధించిపెట్టి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు.