Ys Jagan : వైఎస్ జగన్ నిర్ణయాన్ని అభినందించిన శారదా పీఠాధిపతి
Ys Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన విషయంలోనే కాకుండా సంక్షేమ పథకాల అమలు మరియు కొన్ని సున్నిత అంశాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన్ను గొప్ప వ్యక్తిగా మరియు గొప్ప ముఖ్యమంత్రిగా మార్చేస్తున్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు హిందూ ధర్మంను మరియు హిందూ దేవాలయాలను గురించి ఎక్కువ శాతం ముఖ్యమంత్రులు.. ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. కాని జగన్ మోహన్ రెడ్డి మాత్రం గుడులు మరియు వాటి పై ఉన్న అర్చకుల విషయంలో చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఆయన గొప్ప మనసు చాటుకుని మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు.
తాజాగా ఏపీ ప్రభుత్వం నుండి విడుదల అయిన జీవో రాష్ట్రంలోని చిన్న దేవాలయాలకు చాలా పెద్ద ఊరటను ఇస్తుంది. చిన్న దేవాలయాలు ఇక నుండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దేవాదాయ శాఖ కు తమ కు వచ్చే ఆదాయంను ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్న దేవాలయాలు రాష్ట్ర దేవాదాయ శాఖ లో భాగమే కాని ఖచ్చితంగా వాటి ద్వారా వచ్చే ఆదాయంను ఆ దేవాలయాల అభివృద్దికి మరియు ఆ దేవాలయం మీద ఆదాపడ్డ కుటుంబాలకు మాత్రమే ఇవ్వాలని తాజాగా కొత్త నిర్ణయం చెబుతుంది అంటూ ఏపీ దేవాదాయ శాఖ ముఖ్య అధికారులు మరియు వైకాపా నాయకులు చాలా బలంగా చెబుతున్నారు.
అయిదు లక్షల లోపు ఆదాయం వచ్చే ఏ దేవాలయం అయినా కూడా ఇక నుండి దేవాదాయ శాఖకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన కొత్త జీవో ను శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ప్రశంసించారు. ఇది ఎన్నో దేవాలయాలను కాపాడటం అంటూ జగన్ ను స్వామి వారు ప్రశంసించారు. ఇప్పటి వరకు దేవాలయాల ఆదాయం నుండి దాదాపుగా పది పదిహేను శాతం ప్రభుత్వంకు వచ్చేది. కాని ఇక నుండి ఆ మొత్తంను ప్రభుత్వం వసూళ్లు చేయకుండా పూర్తి స్వేచ్చను సదరు దేవాలయాలకు ఇవ్వబోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆడిట్ మాత్రం అలాగే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని చిన్న దేవాలయాలు పెద్ద ఎత్తున అభివృద్ది చెందే అవకాశం ఉందంటున్నారు.