TDP And Janasena : టీడీపీ, జనసేన పంచుకోవాల్సింది ఐదు సీట్లు మాత్రమే.!
TDP And Janasena : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా అందుతున్నాయని పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న విషయం విదితమే. అయితే, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో గడప గడపకీ వెళ్ళి వాస్తవ పరిస్థితుల్ని తెలియజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిథులకు స్పష్టం చేశారు. అధినేత ఆదేశాల మేరకు వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ‘గడప గడపకూ వైఎస్సార్సీపీ’ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. అవినీతి రహిత పాలన అందిస్తూ,
గడప వద్దకే సంక్షేమ ఫలాల్ని అందిస్తోన్న వైసీపీ ప్రభుత్వం, వచ్చే ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, వైసీపీకే మళ్ళీ పట్టం కడతామని చెబుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.ఈ గడప గడపకీ వైఎస్సార్సీపీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుండడంతో, వచ్చే ఎన్నికల్లో విపక్షాలు కేవలం ఐదు సీట్లు మాత్రమే పంచుకోవాల్సి వస్తుందంటూ వైసీపీ నేతలు సెటైర్లేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి 170 నుంచి 175 సీట్లు వచ్చే అవకాశముందనీ, మొత్తంగా 175 సీట్లూ తాము కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తామని వైసీపీ కీలక నేతలు వ్యాఖ్యానిస్తుండడం సంచలనంగా మారింది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అడిగినందుకే ప్రజలు మనకి 151 సీట్లు ఇచ్చారు. వారికి మెరుగైన పాలన అందించాం. మనకెందుకు 175 సీట్లను ప్రజలు ఇవ్వరు.?
ప్రజల వద్దకే వెళ్ళండి.. ఇంకోసారి ఇంకా ఘనంగా ఆశీర్వదించమని చెప్పండి.. అంటూ వైసీపీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.దీనికి తోడు, సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకు అందించే దిశగా సంక్షేమ క్యాలెండర్ రూపొందించి, దాని ప్రకారం ఆయా పథకాల్ని సకాలంలో అందిస్తూ, ఆ విషయం నేరుగా ప్రజలకే చెప్పేందుకు ముఖ్యమంత్రి ఆ ప్రజల వద్దకే బహిరంగ సభలు, ప్రత్యేక కార్యక్రమాలతో వెళుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెండేళ్ళ తర్వాత ఎన్నికలు జరగాల్సి వుండగా, ఇప్పుడే ఈ ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ జోరు చూస్తోంటే, అధికారంపై కన్నేసిన టీడీపీ, జనసేన.. కలిసి పోటీ చేసినా, కేవలం ఐదు సీట్లే పంచుకోవాల్సి రావొచ్చుననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.