TDP – Janasena : టీడీపీకి మబ్బులు విడిపోయాయ్.! జనసేనదే ఛాన్స్.!
TDP – Janasena : గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా సర్వేలు జరుగుతున్నాయి. ఫేక్ సర్వేలకు సంబంధించిన విషయాలూ వెలుగులోకి వస్తున్నాయి. ఖచ్చితంగా సర్వేల ప్రభావం ఎంతోకొంత ఎన్నికలపై వుంటుంది. ఒకప్పుడు జరిగే సర్వేలు వేరు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సర్వేలు వేరు. ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా సర్వేలు చేయిస్తున్నాయి, జనంలోకి తమ పార్టీల భావజాలాన్ని సర్వేల ద్వారా తీసుకెళుతున్నాయి కూడా. సరే, ఆ సంగతి పక్కన పెడితే.. ఇటీవలి కాలంలో వెలుగు చూస్తున్న సర్వేల ఫలితాల్ని చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చిత్ర విచిత్రమైన అంశాలు తెరపైకొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని దాదాపు అన్ని సర్వేలూ తేల్చేస్తున్నాయి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అధికారం కోసం చంద్రబాబు పదేళ్ళు ఎదురుచూడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావొచ్చు. మూడేళ్ళుగా ప్రతిపక్ష నేతగా వుండడమే కష్టంగా మారింది. ఇంకో ఏడేళ్ళు ప్రతిపక్ష నేతగానా.? అప్పటిదాకా టీడీపీ అంటూ వుండాలి కదా.? వచ్చే ఎన్నికల్లో టీడీపీ గల్లంతవడం ఖాయమే. ఆ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి జనసేన పార్టీ ఎంత దూరంగా వుంటే ఆ పార్టీకి అంత మంచిది. ఔను, ప్రధాన ప్రతిపక్షంగా జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో హోదా దక్కించుకుంటే, ఆ తర్వాత ఐదేళ్ళకైనా జనసేన అధికారంలోకి వచ్చేందుకు ఆస్కారం వుంటుంది.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అన్న చందాన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినిమాల్ని పక్కన పెట్టి, టీడీపీతో సంబంధాల్ని కూడా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల తరఫున చిత్తశుద్ధితో నిలబడి, అధికార వైసీపీకి పోటీగా సత్తా చాటగలిగితే, జనసేనకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు వుంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చాలా సర్వేలు జనసేనను పరిగణనలోకి తీసుకోకపోవడంతో, టీడీపీ వర్సెస్ వైసీపీ.. అన్న లెక్కల్లో, జనసేనకు రాబోయే సీట్ల గురించి పేర్కొనడంలేదుగానీ, డబుల్ డిజిట్ అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన టచ్ చేసేందుకు ఆస్కారం వుందని తాజా పరిస్థితుల్ని బట్టి అర్థమవుతోంది.