TDP – BJP : బీజేపీలో చేరనున్న ఆ టీడీపీ ఎంపీ ఎవరబ్బా.?
TDP – BJP : తెలుగుదేశం పార్టీకి వున్న లోక్ సభ సభ్యుల సంఖ్య మూడు. అందులో కేవలం ఒక్కరు మాత్రమే రాజకీయంగా టీడీపీలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఆయనే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు (రామ్మోహన్‌కి చిన్నాన్న), భవానీ (రామ్మోహన్ సోదరి) అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీలో వున్న మరో ఇద్దరు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్. ఈ ఇద్దరూ నిజానికి, కాస్తంత అగ్రెసివ్ పొలిటీషియన్స్. పైగా, ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం.. అందునా చంద్రబాబు సామాజిక వర్గం కూడా. కానీ, ఆ ఇద్దరూ గత కొంతకాలంగా టీడీపీతో కనిపించడంలేదు.
గల్లా జయదేవ్ విషయంలో అమర్‌రాజా సంస్థ మీద ‘నొక్కింది’ వైసీపీ సర్కారు. అప్పటినుంచే గల్లా జయదేవ్, ఒకింత టీడీపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరించాల్సిన పరిస్థితి. ఇక, కేశినేని నాని రూటే సెపరేటు. ఆయన టీడీపీలో వున్నా, పక్కలో బల్లెం లాంటి వ్యవహారమే ఎప్పుడూ.! ఇదిలా వుంటే, వచ్చే ఆగస్టులో టీడీపీ నుంచి ఓ లోక్ సభ సభ్యుడు బీజేపీలోకి దూకెయ్యబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
రామ్మోహన్నాయుడు ఎటూ టీడీపీని వీడే అవకాశం లేదు. టీడీపీని వీడే అవకాశం వున్నవారిలో కేశినేని నాని, గల్లా జయదేవ్ వున్నారు. ఈ ఇద్దరిలో గల్లా జయదేవ్, బీజేపీ వైపు వెళ్ళే అవకాశం వుందంటున్నారు. కేశినేని సైతం పక్క చూపులు చూస్తున్నారు. నిండా మునిగినోడికి చలేంటన్నట్టు.. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నిండా మునిగిపోయిన దరిమిలా, ఒక్కరు కాదు.. వున్న ముగ్గురు ఎంపీలూ టీడీపీని వీడినా, ఆ పార్టీకి అదనంగా కలిగే నష్టమేమీ వుండదు.