KCR : ఉగాది పూట సీఎం కేసీఆర్ కు భారీ షాకిచ్చిన రైతులు.. హైకోర్టులో పిటిషన్?
KCR : ప్రస్తుతం తెలంగాణలో సాగర్ ఉపఎన్నిక గురించే హాట్ టాపిక్. ఎక్కడ చూసినా సాగర్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అనేదే బాగా చర్చనీయాంశం అవుతోంది. ఈనెల 17న సాగర్ ఉపఎన్నిక జరగనుంది. ప్రచారానికి ఇంకా మూడు రోజులే సమయం ఉండటంతో… ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలైతే మామూలుగా లేవు. ఈసారి ఏకంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు. ఇదివరకు ఎప్పుడూ లేనిది… సాగర్ ఉపఎన్నిక ప్రచారం కోసం సీఎం కేసీఆర్ రెండు సార్లు సభ పెట్టబోతున్నారు. ఇప్పటికే ఫిబ్రవరిలో హాలియాలో భారీ బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్.. మరోసారి ఈనెల 14న అంటే రేపు బుధవారం అదే హాలియాలో బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.
అయితే… కేసీఆర్ బహిరంగ సభకు చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభను రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కేసీఆర్ అక్కడ సభ పెడితే.. వేల మంది ఒకే చోట గుమికూడుతారని… దాని వల్ల కరోనా వ్యాప్తి ఇంకా పెరిగే ప్రమాదం ఉందని… ఈసీకి ఫిర్యాదు చేశారు. కట్ చేస్తే… కేసీఆర్ సభను నిర్వహించేది లేదని… రైతులు ఏకంగా హైకోర్టు మెట్లే ఎక్కేశారు. హాలియా స్థానిక రైతులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం రోజున రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా… అత్యవసర అనుమతిని కోర్టు నిరాకరించింది.
KCR : మరోసారి పిటిషన్ వేసిన రైతులు
హైకోర్టు అత్యవసర అనుమతిని నిరాకరించడంతో… తాజాగా ఇవాళ చీఫ్ జస్టీస్ బెంచ్ వద్ద మరోసారి రైతులు పిటిషన్ దాఖలు చేశారు. తమ భూముల్లో సభను నిర్వహిస్తున్నారని… తమ అనుమతి తీసుకోకుండా.. తమ భూముల్లో ఎలా సభను నిర్వహిస్తారంటూ వాళ్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే… ఇప్పటికే సీఎం కేసీఆర్ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ అసలు సీఎం సభ రేపు ఉంటుందా? ఉండదా? అనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. కేసీఆర్ సభ అయితే ఉంటుంది.. అన్న ఉద్దేశంతోనే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.