తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం?
Corona Second Wave : ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో రోజూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా కరోనా పాజిటివ్ వస్తోంది. అవసరం ఉంటే తప్ప జనాలు కూడా బయటికి వెళ్లడం లేదు. బయట పరిస్థితులు అస్సలు బాగా లేవు. కరోనాతో సామాన్య ప్రజలే కాదు… రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు.. అందరూ సఫర్ అవుతున్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కు కరోనా సోకడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తాజాగా మంత్రి కేటీఆర్ కూ కరోనా సోకడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఎన్నో జాగ్రత్తలు తీసుకొని.. శానిటైజర్లు వాడి.. మాస్కులు పెట్టుకొని… అంత జాగ్రత్తగా ఉండే వాళ్లకే కరోనా సోకుతుంటే.. ఇక సామాన్య ప్రజలు పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. రాజకీయ నాయకులు కూడా చాలామంది కరోనాతో పోరాడారు. మరోవైపు కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం కూడా బాగానే కష్టపడుతోంది. కావాల్సిన వెంటిలేటర్లను సర్దుతూ.. ఆక్సీజన్ సిలిండర్లను తెప్పిస్తూ… ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన బెడ్స్ ను కూడా ఏర్పాటు చేస్తోంది.
Corona Second Wave : వివాదాస్పద నిర్ణయం తీసుకున్న ఈటల రాజేందర్
ప్రస్తుతం ప్రభుత్వాన్ని ముందుండి నడిపించాల్సిన సీఎం కేసీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మంత్రి కేటీఆర్ కూడా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక మిగిలిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను మరో 15 రోజుల వరకు ఎవ్వరూ కలవొద్దంటూ ప్రకటించారు. తనతో ఏదైనా పని ఉంటే ఫోన్ చేయాలని.. డైరెక్ట్ గా తనను కలవడానికి ఎవ్వరూ రాకూడదని పార్టీ నాయకులకు, అధికారులకు స్పష్టం చేశారు. అసలే… అటు ప్రభుత్వ పెద్దలు కరోనాతో పోరాడుతున్నారు. ఇక ఆరోగ్య మంత్రి కూడా 15 రోజుల పాటు తనను ఎవ్వరూ కలవడానికి వీలు లేదు అని ప్రకటించారంటే ఆయనకు కూడా కరోనా సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే… ఈటలకు కరోనా వచ్చింది… అనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ… తనే హోం క్వారంటైన్ లో ఉండబోతున్నారా? అనే విషయం తెలియట్లేదు. ఏది ఏమైనా… టీఆర్ఎస్ పెద్దలందరికీ కరోనా భయం పట్టుకుంది.