Narayana : టెన్త్ ప్రశ్నా పత్రం లీక్ మాజీ మంత్రి నారాయణ ఎక్కడ.?
Narayana : తప్పు చేయకపోతే, తాను ఆ తప్పు చేయలేదని ధైర్యంగా మీడియా ముందుకొచ్చి చెప్పాలి కదా.? పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ వ్యవహారంలో వైఎస్ జగన్ సర్కారు అత్యంత సాహసోపేతంగా, అత్యంత వేగంగా స్పందించింది.. నిందితుల్ని అరెస్టు చేయగలిగింది. ఈ అరెస్టుల్లో మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత, టీడీపీ నేత నారాయణ కూడా వున్నారు. అయితే, తెలివిగా ఆ విద్యా సంస్థలతో తనకు సంబంధం లేదని నారాయణ న్యాయస్థానంలో వాదించి బెయిల్ తెచ్చుకోగలిగారు. బెయిల్ పొందడమంటే, నేరం నుంచి క్లీన్ చిట్ పొందినట్టు కాదు. నారాయణ సాదా సీదా వ్యక్తి కాదు. ఓ విద్యా సంస్థల గ్రూపుకి అధినేత. దేశవ్యాప్తంగా నారాయణకు విద్యా సంస్థలున్నాయి.
సాంకేతికంగా వాటితో ఆయనకు సంబంధం లేకపోవచ్చు. కానీ, ఆయన కుటుంబ సభ్యులే అందులో డైరెక్టర్లుగా వున్నారు, ఇతర కీలక పదవుల్లోనూ వున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచాక, నారాయణ అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కోసం నారాయణ ఆర్థికంగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించారనే విమర్శలున్నాయి.అందుకు ప్రతిఫలంగానే నారాయణకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారనీ, అమరావతి ప్రాజెక్టునీ అప్పగించారనీ అంటారు. అమరావతి చంద్రబాబు చెప్పినట్లుగా అంతర్జాతీయ స్థాయి నగరం అవలేకపోయిందిగానీ, ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అమరావతి ద్వారా ఆర్థికంగా గిట్టుబాటు అయ్యిందనే విమర్శల సంగతి సరే సరి. అటు అమరావతి కుంభకోణంలో కావొచ్చు, ఇటు పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో కావచ్చు, నారాయణ మౌనం దేనికి సంకేతం.?
మామూలుగా అయితే మౌనం అర్ధాంగీకారమని చెబుతుంటారు పెద్దలు. ఆ లెక్కన నారాయణ మౌనాన్ని అర్థాంగీకారంగానే అర్థం చేసుకోవాలేమో. ఐదేళ్ళపాటు మంత్రిగా పనిచేసిన నారాయణ, అమరావతి వ్యవహారంతో తనకు సంబంధం లేదని అనకూడదు. అలాగే నారాయణ విద్యా సంస్థలు తనవే అయినా, తనవి కాదని చెప్పుకోకూడదు. ఆ సంస్థల ద్వారా ప్రశ్నా పత్రాల లీకేజీకి పాల్పడ్డారనే విమర్శలు వచ్చినప్పుడు అస్సలు మౌనంగా వుండకూడదు. కానీ, నారాయణ మౌనముని అవతారమెత్తారు.
నారాయణ ఎప్పుడు మౌనం వీడుతారోనని రాష్ట్ర ప్రజానీకం, ఆయన మౌనం వీడిత ఏమవుతుందోననే ఆందోళనతో చంద్రబాబు.. కనిపిస్తున్నారు.