Munugode Bypoll : మునుగోడులో కాంగ్రెస్ కనుమరుగవటానికి కారణాలు.. ఎన్నో..!!
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలలో పోటీ దాదాపు టిఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్యే నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ప్రతి రౌండ్ ఉత్కంఠ భరితంగా కౌంటింగ్ జరుగుతోంది. మునుగోడులో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ మూడో స్థానానికి పరిమితమైంది. పోటీలో ఎక్కడా కూడా దరిదాపుల్లో లేకుండా సాంప్రదాయ ఓట్లు కాపాడుకుంటూ మూడో స్థానానికి పరిమితం అయింది. మొదటి నుండి మునుగోడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఈ నియోజకవర్గంలోని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోవర్ధన్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కుమార్తె పాల్వయ స్రవంతి రెడ్డికి పార్టీ నుండి సరైన ప్రోత్సాహం రాకపోవడంతో ఆమె అంతగా వెలుగులోకి రాలేకపోయారు.
ఈ నియోజకవర్గంలో ఎంతో బలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక టైంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించేశారు. కానీ స్రవంతి రెడ్డికి టికెట్ ఇవ్వటంలో కాంగ్రెస్ చాలా జాప్యం చేసింది. ఇదే సమయంలో ఆమె అభ్యర్థత్వం ఖరారు అయిన తర్వాత కోమిటిరెడ్డి వెంకటరెడ్డి… ప్రచారానికి దూరంగా ఉండి సైలెంట్ గా ఆస్ట్రేలియా వెళ్లిపోవడం కాంగ్రెస్ కి అతిపెద్ద దెబ్బ. ఈ పరిణామంతో తన తండ్రి చరిష్మాను గుర్తు చేసుకుంటూ స్రవంతి రెడ్డి ప్రచారంలో ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. మహిళా సెంటిమెంట్ నమ్ముకుని నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం చేసింది.
ఇక ఇదే సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో జరుగుతూ ఉండటంతో మునుగోడు కాంగ్రెస్ ప్రచారంలో కీలక నాయకులు ఎవరూ లేరు. ఈ రకంగా ఒంటరి అయినా కాంగ్రెస్ పార్టీ.. టిఆర్ఎస్, బిజెపి పార్టీలతో పోలిస్తే పెద్దగా డబ్బులు కూడా పంచలేదని టాక్. దీంతో చాలా ఓటర్లు ఆ రెండు పార్టీల వైపే మొగ్గు చూపారు. మరి ముఖ్యంగా కోమిటీరెడ్డి వెంకటరెడ్డి వర్గం నాయకులంతా రాజగోపాల్ రెడ్డి వైపు వెళ్లడం కూడా కాంగ్రెస్ కి ఒక మైనస్ అయ్యిందట. ఇలాంటి రాజకీయాల మధ్య మునుగోడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న స్రవంతి రెడ్డి వన్ మాన్ ఆర్మీగా ప్రచారం చేయటంతో మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అయిందని విశ్లేషకులు అంటున్నారు.