Congress : గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. మరో మూడు పథకాలు అమలు ఖరారు…!!
Congress : ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పటికే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. ఇక రెండవది ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. త్వరలోనే మరో మూడు పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గృహలక్ష్మి లో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహాలక్ష్మి లో భాగంగా రూ. 500 కే గ్యాస్ సిలిండర్, చేయూత పథకం కింద పింఛన్లను రూ. 4000కు పెంచడం లాంటి పథకాలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి చివర్లో లోకసభ ఎన్నికల షెడ్యూలు రానున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో అంతకుముందే వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. గ్యాస్ సిలిండర్ ఫ్రీ కరెంట్ హామీలు కొత్తవి కావడంతో వాటికి నిర్దిష్టమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పెన్షన్ల పథకం కు ఇప్పటికే నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఉన్నందున అవసరమైన సవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ మూడు పథకాలు లాంచ్ విషయమై ఆయా శాఖల అధికారులతో సీఎం, మంత్రులు సమీక్షించారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య, అవసరమైన బడ్జెట్ సమకూర్చుకునే మార్గాలు వంటి అంశాలపై ఇప్పటికే అధికారులు ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. ఈ మూడు పథకాలను అమలు చేయడానికి నెలవారీగా ప్రభుత్వంపై ఎంత అదనపు భారం పడుతున్నది ప్రభుత్వము లెక్కలు వేసింది. ఆయా శాఖల అధికారుల నుంచి లబ్ధిదారుల సంఖ్య నిధుల ఖర్చు తదితరాంశాలపై వివరాలను సేకరించి ఒక అంచనాకు వచ్చింది. ఆసరా పింఛన్ల విషయంలో ప్రస్తుతం ఏట 7వేల కోట్ల మేర ఖర్చు అవుతుండగా, ఇకనుంచి అది రెట్టింపు కావచ్చు అని అంచనాకు వచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టే పథకాలకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నా ఆ వ్యయం భరించలేనంత స్థాయిలో ఉండకపోవచ్చు అని భావిస్తుంది.
ప్రస్తుతం ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగంగా అభయహస్తం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తుంది. వాటి డేటా ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత లబ్ధిదారుల సంఖ్య పైన ఈ పథకాలకు అయ్యే ఖర్చు పైన మరింత క్లారిటీ రానుంది. ఈ నెల 17వ తేదీ కల్లా డేటా ప్రాసెసింగ్ గణాంకాలు చివరికి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఫిక్స్ చేసింది. రానున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో కొత్తగా ఈ మూడింటిని లాంచ్ చేసి ప్రచారంలో విస్తృతంగా వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు పథకాలు రెండు నెలల్లో మరో మూడింటిని అమలు చేశామని గర్వంగా కాంగ్రెస్ చెప్పుకోవాలనుకుంటుంది. కాంగ్రెస్ ను విమర్శిస్తున్న వారికి ఆచరణతోనే సమాధానం చెప్పాలని అనుకుంటుంది. మిగిలిన గ్యారెంటీలను కూడా తప్పకుండా అమలు చేస్తామని ప్రజలకు భరోసా కలిగిస్తుంది.