YCP : వైసీపీ పాలనలో మూడేళ్ళు.! సాధించింది ఇదీ.! సాధించాల్సినది ఇదీ.!
YCP : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్నారు. సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మెరుగైన పాలన అందించేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన రెండేళ్ళు కూడా అత్యద్భుతమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి తప్పడం, గత పాలకులకు అలవాటైన విద్య అయితే.. ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీల్ని మూడేళ్ళలో నెరవేర్చిన ఘనత తమదని వైసీపీ చెబుతోంది.
ఇదే విషయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో ప్రస్తావించారు.కోవిడ్ సహా అనేక కారణాలతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా, సంక్షేమ పథకాలకు లోటు లేకుండా చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అప్పులు చేసి డబ్బులు పంచుతున్నారు.. అంటూ విపక్షాలు విమర్శలు చేసినాసరే, రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే, అది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.రాష్ట్ర అవసరాల నిమిత్తం అప్పులు చేయాల్సి వస్తే, కేంద్రం నుంచి సహకారం అందడంలేదు. ఇంకోపక్క, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల విక్రయించాలనుకుంటే.. కోర్టుల్లో కేసులు..
ఇలా అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా, అత్యంత సమర్థవంతంగా రాష్ట్రంలోకి అప్పుల రూపంలో అయినా, నిధుల్ని తీసుకురాగలుగుతున్నామన్నది వైసీపీ చెబుతున్న వాదన.మూడేళ్ళ పాలన ఒక యెత్తు.. ఇకపై మిగిలిన రెండేళ్ళ పాలన ఇంకో యెత్తు. అసలు సవాళ్ళు వైసీపీకి ఇప్పుడే ఎదురుకానున్నాయి. మూడేళ్ళ పాలనా కాలంలో జరిగిన ఎన్నికలన్నిటిలోనూ వైసీపీ విజయం సాధించింది. అయితే, సంక్షేమ పథకాల తాలూకు ఎఫెక్ట్ ఏంటన్నది ముందు ముందు తెలియనుంది. అవి సత్ఫలితాలనిస్తాయా.? లేదా.? అన్నదానిపైనా వైసీపీకి కొంత సందేహం వుంది. ఆ సందేహాలకు సమాధానం దొరకాలంటే 2024 ఎన్నికల వరకూ వేచి చూడాలి.