Kamini Konkar | భర్తను కాపాడాలని అవయవం దానం చేసిన భార్య – నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి
భర్త ప్రాణాలు రక్షించేందుకు తన అవయవాన్ని దానం చేసిన ఓ భార్య… చివరకు ప్రాణాన్ని కోల్పోయిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన భర్త కోసం కాలేయం దానం చేసింది భార్య. రెండు రోజుల వ్యవధిలో భర్త మరణించగా, మరో నాలుగు రోజుల్లో ఆమె కూడా ప్రాణాలు విడిచింది.

#image_title
వైద్యులు నిర్లక్ష్యమేనా?
పూణే జిల్లాకు చెందిన బాపు కోంకర్ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఆయన కాలేయం పూర్తిగా దెబ్బతిందని, వెంటనే మార్పిడి అవసరమని తెలిపారు. ఈ పరిస్థితిలో ఆయన భార్య కామిని తన కాలేయంలో భాగాన్ని భర్తకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది.ఆగస్టు 15న పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. కామినీ శరీరంలోని కాలేయ భాగాన్ని తీసి, బాపు శరీరంలో అమర్చిన అనంతరం అతడి ఆరోగ్యం మెరుగవుతుందని భావించారు. అయితే ఆశించిన ఫలితం రాలేదు. ఆపరేషన్ తర్వాత రెండు రోజుల్లోనే ఆగస్టు 17న బాపు కన్నుమూశాడు.
మరోవైపు, ఆపరేషన్ అనంతరం కామినికి భారీ ఇన్‌ఫెక్షన్ సోకింది. వైద్యులు చికిత్స అందించినప్పటికీ, ఆగస్టు 21న ఆమె కూడా మృతి చెందింది. ఒక్క కుటుంబంలో నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరూ చనిపోయారని, ఆసుపత్రిపై ఆరోపణలు మోపుతూ ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబం శస్త్రచికిత్సకి సంబంధించిన పూర్తి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.