Raja Singh : రాజా సింగ్ అరెస్ట్.! టీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పిదమా.?
Raja Singh : ఒవైసీ సోదరులు మాట్లాడితే తప్పు కాదా.? రాజా సింగ్ మాట్లాడితే తప్పు అవుతుందా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలకు ఒవైసీ బ్రదర్స్ కేరాఫ్ అడ్రస్. రాజా సింగ్ సంగతి సరే సరి.! ఒకప్పుడు రాజా సింగ్ ఏం మాట్లాడినా చెల్లిపోయేది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. రాజా సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని బీజేపీ సస్పెండ్ చేసింది, షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది. వాస్తవానికి తొలుత షోకాజ్ నోటీస్ జారీ చేసి, ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి. ఇక్కడ భిన్నమైన రెస్పాన్స్ బీజేపీ నుంచి వచ్చింది. అంతా రివర్స్ వ్యవహారం నడుస్తోంది. నుపుర్ శర్మ విషయంలో ఎదురైన తలనొప్పి, రాజా సింగ్ విషయంలో రిపీట్ కాకూడదనే, బీజేపీ అప్రమత్తమయి వుండాలి.
అసలు రాజా సింగ్ ఏం మాట్లాడారు.? అన్నది ఇక్కడ చర్చించుకోలేం. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరమే. అయితే, రాజకీయాల్లో ఆయనొక్కడే అభ్యంతరకరమైన భాష ఉపయోగించడంలేదు. అందరిదీ దాదాపు అదే తీరు. కాస్త ఎక్కువ, కాస్త తక్కువ.. అంతే తేడా. రాజా సింగ్ అరెస్ట్ వ్యవహారంతో హిందూ సమాజంలో కకొంత అసహనం కనిపిస్తోంది. ముస్లిం సమాజంలో కాస్త అలజడి తగ్గింది. రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు ఓ వర్గంలో అలజడి రేపాయి. ఆ వ్యాఖ్యలు ఇంకో వర్గాన్ని మెప్పించలేదు. అదే అసలు విషయం.
కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. న్యాయం అందరికీ ఒకేలా వుండాలి కదా.? పోలీసు వ్యవస్థ ఒక్కొక్కరితో ఒ్కోలా వ్యవహరిస్తోందన్న చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది. ఇక్కడ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డంగా బుక్కయిపోయింది. మిత్రపక్షం గనుక మజ్లిస్ నాయకులు ఎంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నా, వారిపై చర్యల్లేవన్న వాదన వినిపిస్తోంది. తద్వారా రాజా సింగ్ పట్ల మద్దతు పెరుగుతోంది. ఇదంతా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయంగా చేటు చేస్తుందనేది నిర్వివాదాంశం.